వీధి కుక్కపిల్లలను దత్తత తీసుకోండి: మంత్రుల పిలుపు
కేబీఆర్ పార్కులో ఘనంగా 'ఇండీ పప్పీల' దత్తత మేళా
హైదరాబాద్:
మన వీధుల్లో తిరిగే కుక్కపిల్లలకు ఆశ్రయం కల్పించి, వాటిని మన ఇంటి సభ్యుల్లా ఆదరించాలని రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు ప్రాంగణంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘బీ ఏ హీరో.. అడాప్ట్, డోంట్ షాప్’ (నాయకుడిగా నిలవండి.. దత్తత తీసుకోండి, కొనవద్దు) అనే నినాదంతో నిర్వహించిన దేశీ కుక్కపిల్లల దత్తత మేళాను వారు ప్రారంభించారు.
కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి:
"దత్తత తీసుకున్న కుక్కపిల్లలను కేవలం జంతువుల్లా కాకుండా, మన ఇంట్లోని ఒక ఫ్రెండ్ లా, కుటుంబ సభ్యుడిలా ప్రేమతో చూసుకోవాలి" అని వారు సూచించారు.
దత్తత తీసుకున్న యజమానులు తమ పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు (వ్యాక్సినేషన్) వేయించాలని, సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు (స్టెరిలైజేషన్) చేయించాలని మంత్రులు కోరారు. ఇండీ కుక్కపిల్లల కోసం ఇలాంటి మేళాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగాన్ని వారు అభినందించారు. భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
విశేష స్పందన.. 30 పిల్లల దత్తత
వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ మేళాకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. మేళాలో డీ-వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తి చేసిన 50 దేశీ కుక్కపిల్లలను ప్రదర్శనకు ఉంచగా, అందులో 30 పిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. మంత్రులు స్వయంగా పప్పీలను పరిశీలించి, దత్తత తీసుకున్న వారికి వాటిని అందజేసి అభినందనలు తెలిపారు.
ప్రేమకు చిహ్నమైన ప్రేమికుల రోజున మూగజీవాల పట్ల ఈ విధమైన ఆత్మీయతను చాటడం మానవత్వానికి నిదర్శనమని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల, జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
