బడంగ్‌పేట్‌లో 'మంట' పుట్టిస్తున్న మల్టీస్టోరీ బిల్డింగులు!
- అగ్ని భద్రత గాలికి.. అధికారుల నామమాత్రపు తనిఖీలు?
- 99 రోజుల ప్లాన్‌లో భాగంగా సర్కిల్-16లో నోటీసుల జారీ
బడంగ్‌పేట్:
నిబంధనలు తుంగలో తొక్కి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు అగ్నిగుండాలుగా మారుతున్నాయి. అగ్ని భద్రత (ఫైర్ సేఫ్టీ) ఊసే లేని కట్టడాలు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శుక్రవారం బడంగ్‌పేట్ సర్కిల్-16 పరిధిలో అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. జోనల్ కమీషనర్ కె. చంద్రకళ ఆదేశాలతో డిప్యూటీ కమీషనర్ పి. సరస్వతి రంగంలోకి దిగి పలు భవనాలను పరిశీలించారు.
సేఫ్టీ నిల్.. నోటీసులు ఫుల్!
తనిఖీల్లో భాగంగా అగ్ని భద్రత చర్యలు తీసుకోని బహుళ అంతస్తుల భవనాలను అధికారులు గుర్తించారు. కనీసం ఫైర్ ఎస్టింగిషర్లు, అత్యవసర ద్వారాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్ని భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వెంటనే చర్యలు తీసుకోకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని డిప్యూటీ కమీషనర్ హెచ్చరించారు.
అయితే, అధికారులు కేవలం స్పెషల్ డ్రైవ్‌లు ఉన్నప్పుడే ఇలాంటి తనిఖీలు చేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. బిల్డింగులు కడుతున్నప్పుడే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, ప్రమాదకరమైన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్ ఎం. దినేష్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

