సరూర్నగర్ లో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు పట్టించుకునే నాధుడేడి..!
- మున్సిపల్ నిబంధనల ప్రకారం అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ సెల్లార్ తవ్వకం
- *నోటీసులకే పరిమితమైన సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు
- *చర్యలు తీసుకోవడంలో ఎందుకీ కాలయాపన? స్థానికుల ప్రశ్న
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్.
సరూర్నగర్:
సరూర్నగర్ సర్కిల్ 12 ఆఫీస్ గేటుకు ఎదురుగా ఎమ్మార్వో ఆఫీస్ గేటు ఎదురుగా భారీ అక్రమ నిర్మాణం ముడుపులు అందుకుని చూసి చూడు నట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే
మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా లోతైన సెల్లార్ త్రవ్వి బిల్డింగ్ చుట్టూ స్థలం వదలకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ, ఎల్‌బీనగర్ జోన్, సరూర్నగర్ సర్కిల్-12 పరిధిలో నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తున్నా, టౌన్ ప్లానింగ్ విభాగం కేవలం నోటీసుల జారీకే పరిమితమైందనే ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీ వెంకటేశ్వర కాలనీ, సరూర్నగర్ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 9, 9/2, 9/3 లోని ప్లాట్ నెంబర్ 11 (తూర్పు భాగం), ప్లాట్ నెంబర్ 5 (పడమర భాగం) లలో ఒక స్టిల్ట్ మరియు నాలుగు అంతస్తుల (1 స్టిల్ టు + 4 అప్పర్ ఫ్లోర్స్) నివాస భవనం కోసం అనుమతి (పర్మిట్ నెంబర్ : 0129/జిహెచ్ఎంసి/ఎస్. డబ్ల్యు.బి.పి/ఎల్.బి.ఎన్.జెడ్/2025, Date: 23.09.2024) తీసుకున్నారు.
అయితే, క్షేత్రస్థాయిలో ఈ ప్లాన్‌కు పూర్తిగా విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. నివాస భవన పర్మిషన్‌తో ఏకంగా కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా, అనుమతి లేకపోయినా ప్రమాదకర రీతిలో అక్రమంగా ‘సెల్లార్’ తవ్వేసి, కనీస సెట్ బ్యాక్స్ (చూట్టు వదలాల్సిన స్థలం) కూడా పాటించకుండా భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
*భవన నిర్మాణ వివరాలు:
*స్థలం: ప్లాట్ నెం. 11, ప్లాట్ నెం. 5, శ్రీ వెంకటేశ్వర కాలనీ, సరూర్నగర్.
*నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ‘సీజింగ్’ ఏది?
ఈ అక్రమ నిర్మాణంపై డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి సదరు యజమాని జి. సాయిబాబుకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. మున్సిపల్ చట్టాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలను బేఖాతరు చేస్తూ గత 8 నెలలుగా ఇక్కడ పనులు జరుగుతున్నా, అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు.
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ అధికారి సాయి అర్చన కేవలం కాలయాపన చేస్తూ, నిర్మాణాన్ని సీజ్ చేయకుండా వెనకడుగు వేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ల మత్తులోనే అక్రమ నిర్మాణాన్ని చూసీచూడనట్లు వదిలేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
*కొత్త ఏసీపీ చర్యలు తీసుకునేనా?
అనుమతులు ఒకదానికి ఉండి, నిర్మాణం మరొకటి జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సరూర్నగర్ ఇంచార్జ్ ఏసీపీ (Town Planning) అంబికా శ్రీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్, ఫైర్ సేఫ్టీ నిబంధనలను గాలికొదిలేసిన ఇలాంటి నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశముందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
