కాలనీ సంఘాల 'కబ్జా' కోరల్లో ప్రజా స్థలాలు!

​అప్పనంగా అమ్మేస్తున్న వైనం.. ప్రశ్నిస్తే దాడులు

  • హైడ్రా ‘ప్రజావాణి’కి పోటెత్తిన ఫిర్యాదులు: ఒక్కరోజే 72 వినతులు
  • చెరువులు, పాఠశాల మైదానాలూ వదలని ఆక్రమణదారులు

కాలనీ సంఘాల 'కబ్జా' కోరల్లో ప్రజా స్థలాలు!

హైదరాబాద్ :
 
నగరంలోని కాలనీల్లో పచ్చదనాన్ని పంచాల్సిన పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. రక్షించాల్సిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే భక్షకులుగా మారి యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అసోసియేషన్ల ముసుగులో పార్కులు, రహదారులు, చివరకు పాఠశాల క్రీడా మైదానాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న వైనం సోమవారం నిర్వహించిన *'హైడ్రా ప్రజావాణి'*లో వెలుగుచూసింది. ఈ క్రమంలో మొత్తం 72 ఫిర్యాదులు రాగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని స్వీకరించి విచారణకు ఆదేశించారు.

​వేలం వెర్రిగా ఆక్రమణలు.. 
అధికారుల మౌనం

​స్థానిక అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని బాధితులు కమిషనర్ వద్ద వాపోయారు. ఆక్రమణలను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం వంటి చర్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ప్రజావాణిలో ప్రధాన ఫిర్యాదులు ఇవే:
​స్కూల్ గ్రౌండ్‌పై కన్ను: కూకట్‌పల్లి వెంకటేశ్వర నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. దీనిపై కలెక్టర్, పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, విద్యార్థుల ఆటస్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరారు.
​ఎల్లమ్మ చెరువు విలవిల: మణికొండ ల్యాంకో హిల్స్ సమీపంలోని ఎల్లమ్మ చెరువు చుట్టూ క్రికెట్ గ్రౌండ్లు, పార్కింగ్ స్థలాలు వెలిశాయి. రియల్టర్లు సైతం చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారని, వెంటనే హద్దులు నిర్ణయించాలని ఫిర్యాదు అందింది.

​పార్కు స్థలంలో ప్లాట్లు: మల్కాజిగిరి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన 600 గజాల్లో ఇప్పటికే 136 గజాలు కబ్జాకు గురైందని, వెంటనే ఫెన్సింగ్ వేసి మిగిలిన స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు విన్నవించారు.
​ట్యాంకుల స్థలం విక్రయం: గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంకర్ కోసం కేటాయించిన స్థలంలో కొత్తగా ప్లాట్లు వేసి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు తెలిపారు.
​సంఘాల స్థలాలూ హాంఫట్: ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెలమ సంఘానికి కేటాయించిన 5 ఎకరాల స్థలంపై కోర్టు స్టే ఉండటాన్ని ఆసరాగా తీసుకుని, చుట్టుపక్కల వారు మట్టి పోసి ఆక్రమిస్తున్నారని, అడ్డుకున్న వాచ్‌మెన్‌పై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
​ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు: కాప్రా సర్వే నంబర్ 215లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా లేఅవుట్లు వేసి గదులు, ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నారని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
​అధికారులకు కమిషనర్ ఆదేశం
​వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, సంబంధిత విభాగాల అధికారులకు వీటిని బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆక్రమణలు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

About The Author