కవితక్క కొత్త పార్టీ విజయవంతం కావాలని ఉమామహేశ్వరంలో పూజలు
- పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా అభిషేకాలు..
- ఈ నెల 25న మేడ్చల్ వేదికగా కవిత రాజకీయ ప్రకటన
నల్లమల:
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించబోయే నూతన రాజకీయ పార్టీ ప్రజల ఆదరణ పొందాలని కోరుతూ ఆదివారం ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 25న మేడ్చల్ వేదికగా కవిత తన రాజకీయ కార్యాచరణను వెల్లడించనున్న నేపథ్యంలో, ఈ ప్రస్థానం విజయవంతం కావాలని కోరుతూ స్వామివారికి అభిషేకాలు చేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం: పాండురంగా రెడ్డి
ఈ సందర్భంగా కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసిన కవిత, ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయ వేదికను సిద్ధం చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ఈ నూతన పార్టీ ప్రస్థానం సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈనెల 25న మేడ్చల్ మునీరాబాద్‌లోని శ్రీ అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ విధివిధానాల ప్రకటన ఉంటుందని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం కాబోతోందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి విజయకిరణ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కవిత నేతృత్వంలో సాగే ఈ నూతన ప్రస్థానానికి ప్రజలు, అభిమానులు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా వారు కోరారు.
.jpeg)
