బాలాపూర్ టూ ఆదిబట్ల.. రోడ్లపై ఆక్రమణల తొలగింపు..
- 10 కిలోమీటర్ల మేర క్లీన్ చేసిన అధికారులు
- 313 నిర్మాణాలు ధ్వంసం.. భారీగా పోలీసు బందోబస్తు
బడంగ్‌పేట్:
బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ ఉధృతంగా సాగింది. బాలాపూర్ జంక్షన్ నుంచి నాదర్‌గుల్ మీదుగా ఆదిబట్ల HMWS పంప్ హౌస్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర (రోడ్డుకు ఇరువైపులా) ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు సోమవారం తొలగించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 313 ఆక్రమణలను నేలమట్టం చేశారు.
*శాశ్వత నిర్మాణాలపై బుల్డోజర్లు*
చాలా కాలంగా రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. తొలగించిన వాటిలో 222 తాత్కాలిక షెడ్లు ఉండగా, మరో 101 శాశ్వత నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతల అనంతరం రోడ్డుపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించేందుకు 45 ట్రాక్టర్లను వినియోగించారు. ఈ పారిశుధ్య పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
*ఫ్లెక్సీలు, బోర్డులు తొలగింపు*
అక్రమ కట్టడాలతో పాటు రోడ్ల పక్కన అందవిహీనంగా ఉన్న 250 అక్రమ ఫ్లెక్సీలు, 45 భారీ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు, 12 లాలిపాప్ బోర్డులను అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రచార సామగ్రిని ఎక్కడికక్కడ జప్తు చేశారు.
*సమన్వయంతో ఆపరేషన్*
శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో జరిగిన ఈ డ్రైవ్‌లో వివిధ సర్కిళ్ల డెప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం ఏఈలు, డీఈలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో సుమారు 120 మంది పోలీసులు, ఏసీపీలు భారీ బందోబస్తు నిర్వహించారు. వివిధ శాఖల నుంచి మరో 30 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమన్వయంతో ఆక్రమణలను తొలగించారు.
— *డెప్యూటీ కమిషనర్ & ఏసీపీ, బడంగ్‌పేట్ సర్కిల్-16*
