*సైబరాబాద్ ముఖచిత్రం మార్చడమే లక్ష్యం: రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం.
- *మియాపూర్ ఫ్లైఓవర్, శేరిలింగంపల్లి రైల్వే వంతెన సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు..
- బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం.. ఐటీ కారిడార్‌లో రద్దీ నివారణే ధ్యేయం!
*హైదరాబాద్:
విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ మహానగర కిరీటంలో మరో కీలక మైలురాయి చేరింది. పశ్చిమ హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్, పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం భారీ వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 1,674.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడమే కాకుండా, రాబోయే రోజుల్లో సైబరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చేలా ఈ ప్రాజెక్టులను సీ.ఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
*కార్పొరేషన్ కొత్త చిరునామా.. రూ.161 కోట్లతో ప్రధాన కార్యాలయం
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు, ప్రజలకు అత్యాధునిక సేవలను ఒకే చోట అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.161 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పూర్తి హంగులతో, పర్యావరణ అనుకూల సాంకేతికతతో ఈ పాలనా భవనాన్ని నిర్మించనున్నారు..jpeg)
ఐటీ రంగ నిపుణులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రవాణా రద్దీని నియంత్రించేందుకు సీ.ఎం రేవంత్ రెడ్డి భారీ నిధులను కేటాయించారు.
*మియాపూర్ జంక్షన్ ఫ్లైఓవర్:
అత్యంత రద్దీగా ఉండే మియాపూర్ చౌరస్తాలో రూ.530 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే జాతీయ రహదారిపై ప్రయాణం సులువు కానుంది.
శేరిలింగంపల్లి పరిధిలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఇబ్బందులను తొలగించేందుకు రూ.308 కోట్లతో నిర్మించే రైల్వే వంతెన (ROB) పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.
*బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం: స్థానికులకు ఊరటనిస్తూ రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను సీ.ఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు.
*ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్ల విస్తరణ: ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల అనుసంధానానికి, కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుతో పాటు ప్రధాన వంతెన నిర్మాణానికి రూ.229 కోట్లు కేటాయించారు. అలాగే నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారి విస్తరణకు రూ.26.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కొల్లూరు జంక్షన్ సమీపంలోని రెండు రైల్వే వంతెనల వరకు 4 లైన్ల రహదారి (అప్రోచ్ ర్యాంపులు) నిర్మాణానికి రూ.29.25 కోట్లు కేటాయించారు.
*మెరుగైన తాగునీరు.. పైప్‌లైన్ రహదారి నిర్మాణం
మణికొండ, నార్సింగి పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలు, మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని శంకర్ పల్లి రోడ్డులోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు రూ.110 కోట్లతో పైప్‌లైన్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
*విద్యా, సామాజిక రంగాలకు సీఎం పెద్దపీట
కేవలం భౌతిక మౌలిక వసతులే కాకుండా సామాజిక వసతుల కల్పనకు సైతం సీఎం 'రేవంత్ రెడ్డి ప్రాధాన్యతనిచ్చారు.
*యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్: అంతర్జాతీయ ప్రమాణాలతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమగ్ర పాఠశాల భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
*మహిళా వసతి గృహాలు:
ఐటీ కారిడార్‌లో ఉద్యోగాలు చేసే మహిళల రక్షణ, వసతి కోసం మాదాపూర్, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో రూ.14.40 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ ప్రాజెక్టులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కఠినమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
