తొర్రూరులో ఆధ్యాత్మిక శోభ.. ధగధగలాడిన సుదర్శన మహా హోమ జ్వాలలు!
తుర్కయంజాల్ (తొర్రూరు): భారత శక్తి,
సూర్య భగవానుడి జన్మదినమైన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని రంగనాయక స్వామి సన్నిధి భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. జిహెచ్ఎంసి పరిధిలోని తొర్రూరు గ్రామంలో వెలసిన శ్రీ రంగనాయకి సమేత రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన 12 సుదర్శన మహా హోమాలు కనువిందు చేశాయి.
వేదమంత్రాల మధ్య పూర్ణాహుతి:
ప్రముఖ అర్చకులు శ్రీధర్ అయ్యగారు నేతృత్వంలో శాస్త్రోక్తంగా ఈ హోమ క్రతువు జరిగింది. లోక కళ్యాణార్థం, భక్తుల అభ్యున్నతి కోసం పన్నెండు హోమ గుండాల వద్ద ఏకకాలంలో నిర్వహించిన ఈ పూజలతో ఆలయ పరిసరాలు వేదమంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. ఉదయం నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు పూర్తి చేసిన అనంతరం హోమ క్రతువును అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోమ గుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన సంస్కృతిని, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు మరియు సభ్యుల సమన్వయంతో ఏర్పాట్లు అత్యంత ఘనంగా జరిగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. స్థానిక గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసందోహంగా మారింది.
