ఆర్మీ జవాను ప్లాటు కబ్జాకు టౌన్ ప్లానింగ్ అధికారుల సపోర్ట్..!

  • సరిహద్దులో కాపలా.. సొంతూరిలో దగా!
  • ​CRPF అధికారి ప్లాట్లపై మాజీ కార్పొరేటర్ కన్ను.. ఖద్దరు అండతో కబ్జా పర్వం..
  • ​హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు.. GHMC అధికారులపై పొలిటికల్ ప్రెజర్?
  • శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ చర్యలు ఎక్కడ..!

ఆర్మీ జవాను ప్లాటు కబ్జాకు టౌన్ ప్లానింగ్ అధికారుల సపోర్ట్..!

​హైదరాబాద్:

దేశం కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడుతున్న ఒక జవానుకు సొంత గడ్డపై రక్షణ కరువైంది. జమ్మూ కాశ్మీర్‌లో దేశ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న CRPF సెకండ్-ఇన్-కమాండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్. ఆస్తులపై కబ్జా కోరలు చాచాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో ఆయనకు చెందిన విలువైన ప్లాట్లను స్థానిక కార్పొరేటర్, ఆయన అనుచరులు కలిసి అక్రమంగా ఆక్రమించుకున్న వైనం కలకలం రేపుతోంది. కోర్టులు మొట్టికాయలు వేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా కబ్జాదారులు మాత్రం తగ్గడం లేదు సరికదా.. ఏకంగా అధికారుల ముందే బెదిరింపులకు దిగుతున్నారు. 
 
​స్టేటస్ కో ఉన్నా.. కబ్జా ఆగలే!
​గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెం. 155 AA, 156 AAలలో 2016లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్లాట్ నెం. 11, 12లను చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే 2018 నుంచే ఈ ప్లాట్లపై కబ్జాదారుల కన్ను పడింది. అప్పట్లో చెట్టి శ్యామ్ బాబు అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి సరిహద్దు గోడను కూల్చివేయడానికి ప్రయత్నించాడు. బాధితుడు సివిల్ కోర్టును ఆశ్రయించగా, కేసు తేలే వరకు 'యథాతథ స్థితి' (Status Quo) పాటించాలని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించి అధికారి తన ప్లాట్ గోడను కూడా మరమ్మత్తు చేసుకోకుండా వదిలేశారు.  

డ్యూటీలో జవాన్.. ప్లాట్‌లో ఫ్యాబ్రికేటెడ్ షెడ్!
​ప్రవీణ్ కుమార్ జమ్మూ కాశ్మీర్‌లోని బంతలాబ్‌లో విధుల్లో ఉన్న అదను చూసి కబ్జాదారులు రెచ్చిపోయారు. 2024 జనవరిలో గచ్చిబౌలి 105 డివిజన్ కార్పొరేటర్ వాసేపల్లి గంగాధర్ రెడ్డి, చెట్టి శ్యామ్ బాబు, శేఖర్ గౌడ్, కృష్ణారెడ్డి తదితరులు కలిసి ప్రవీణ్ కుమార్ ప్లాట్లతో పాటు పక్కనే ఉన్న BSF ఉద్యోగి రాఘవరావు ప్లాట్‌ను కూడా ఆక్రమించారు. పాత సరిహద్దు గుర్తులను తుడిచివేసి రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ నిర్మించారు. బాధితుడు ఏప్రిల్ 2025లో సెలవుపై వచ్చి చూసేసరికి అక్కడ అక్రమంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ షెడ్‌ను కూడా నిర్మించడం గమనార్హం.  

​అధికారులను బెదిరిస్తున్న మాజీ కార్పొరేటర్?

​ఈ వ్యవహారంలో GHMC అధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన విచారణ ఒక ప్రహసనంగా మారింది.  
​నిందితుడి బదులు కార్పొరేటర్: విచారణకు అసలు నిందితుడు రాకుండా, ఆయన తరపున కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరై అధికారులను బహిరంగంగానే బెదిరించినట్లు తెలుస్తోంది.  
​బేఖాతరు: హైకోర్టు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, GHMC డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇప్పటివరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.  
​అధాంతరంగా నివేదికలు: అక్రమ నిర్మాణమని తేల్చినా కూల్చివేతలకు అధికారులు వెనుకడుగు వేయడం వెనుక భారీ రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.  

​దేశ రక్షకుడికి ఇదేనా గౌరవం?
​"నేను సరిహద్దులో ఉండి దేశాన్ని కాపాడుతుంటే, ఇక్కడ నా ఆస్తిని కాజేస్తున్నారు" అని డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన డిపార్ట్‌మెంట్ గ్రీవెన్స్ సెల్ ద్వారా జిల్లా కలెక్టర్, GHMC కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన మీడియాను ఆశ్రయించారు. ఖద్దరు చొక్కాల అండతో సాగుతున్న ఈ భూదందాను అరికట్టి, తక్షణమే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.

About The Author