లేఅవుట్ మింగేసి.. పాస్‌బుక్ కొట్టేసి!

  • పాటిఘనాపూర్‌లో రియల్ మాఫియా మాయాజాలం
  • ​92 ఎకరాల ఆనందనగర్ లేఅవుట్ కబ్జా.. రోడ్లు, పార్కులూ ఖతం
  • ​క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్.. రీ-సర్వేకు ఆర్డర్

లేఅవుట్ మింగేసి.. పాస్‌బుక్ కొట్టేసి!

పటాన్‌చెరు:

అది 44 ఏళ్ల కిందట వెలిసిన నివాస లేఅవుట్. వెయ్యికి పైగా ప్లాట్లు.. వందలాది మంది బాధితులు. కానీ, ఇప్పుడు అక్కడ లేఅవుట్ మ్యాపులు లేవు.. ప్లాట్ల హద్దులు లేవు. రియల్ మాఫియా ప్లాన్ గీస్తే.. అక్కడ ప్లాట్లు మాయమై సాగు భూమి పుట్టుకొచ్చింది. ఏకంగా ధరణిలో రికార్డులు సృష్టించి పాస్‌బుక్కులు కూడా తెచ్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిఘనాపూర్‌లోని ‘ఆనందనగర్’ లేఅవుట్ కబ్జా బాగోతంపై బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

​రికార్డుల్లో సాగు భూమి.. గ్రౌండ్‌లో ప్లాట్లు!
​1980లో 92 ఎకరాల విస్తీర్ణంలో 1,109 ప్లాట్లతో గ్రామపంచాయతీ అనుమతితో ఆనందనగర్ లేఅవుట్ వెలిసింది. చాలామంది ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌ఎస్ (LRS) కూడా చేయించుకున్నారు. అయితే, కొందరు కబ్జాదారులు లేఅవుట్ హద్దులను చెరిపేసి, దాన్ని వ్యవసాయ భూమిగా చిత్రించారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పాస్‌బుక్కులు సృష్టించి ప్లాట్లను ఆక్రమించుకున్నారని బాధితులు కమిషనర్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

​రోడ్లు, పార్కులూ వదల్లేదు..
​లేఅవుట్‌లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కులు, విశాలమైన రహదారులను సైతం ఆక్రమించి విక్రయించినట్లు బాధితులు ఆధారాలతో సహా వివరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్లాట్ల యజమానులు తమకు జరిగిన అన్యాయాన్ని కమిషనర్‌కు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న లేఅవుట్‌ను సాగు భూమిగా మార్చడంపై రంగనాథ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

​రంగనాథ్ ఆదేశాలు ఇవే..
​పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు:
​అక్రమాలు తేల్చండి: పాత లేఅవుట్ మ్యాపుల ప్రకారం సర్వే చేసి ఆక్రమణలను గుర్తించాలి.

​కబ్జాలు హటావో: లేఅవుట్ పరిధిలోని పార్కులు, రహదారుల్లో ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేయాలి.

​కఠిన చర్యలు: ఫోర్జరీ రికార్డులు సృష్టించిన వారిపై, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న తమకు హైడ్రా రాకతోనైనా విముక్తి లభిస్తుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.WhatsApp Image 2026-03-25 at 17.38.43

About The Author