నగర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి
కూకట్‌పల్లి నల్లచెరువును ప్రారంభించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్:
దేశంలోని అనేక నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో సురక్షితమని, దీనిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అందరూ అభివృద్ధిపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. కూకట్‌పల్లి నల్లచెరువు పునరుద్ధరణ పనులను పూర్తి చేసిన నేపథ్యంలో, దానిని ఆదివారం ప్రజలకు అంకితం చేశారు..jpeg)
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కాలుష్యం కారణంగా పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సి వస్తోందని, ముంబయి వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి సమస్యలు లేని హైదరాబాద్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మూసీ ప్రక్షాళన: గుజరాత్, ఉత్తరప్రదేశ్ తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేస్తాం. మూసీ పరివాహక ప్రాంతాలు, చెరువుల పునరుద్ధరణలో ఎవరైనా నష్టపోతే తగిన పరిహారం చెల్లిస్తాం. పేదలకు అన్యాయం చేయడం ప్రభుత్వ విధానం కాదు.
హైడ్రా పనితీరు: హైడ్రా ప్రారంభించినప్పుడు విమర్శలు వచ్చినా, వరదల నివారణలో దాని పనితీరు అద్భుతంగా ఉంది. చెరువుల అభివృద్ధి ద్వారా పర్యావరణ హితమైన నగరాన్ని నిర్మిస్తాం.
మౌలిక సదుపాయాలు: నగరంలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం, క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తాం.
నియోజకవర్గ అభివృద్ధికి సహకారం:
ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాలాలు, చెరువుల సమస్యలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన పనులను ఇప్పుడు వేగవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఇతర చెరువులను కూడా అభివృద్ధి చేయాలని కోరారు.
30 ఎకరాలకు విస్తరణ:
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ఆక్రమణలతో 16 ఎకరాలకు కుంచించుకుపోయిన నల్లచెరువును, 30 ఎకరాలకు విస్తరించినట్లు తెలిపారు. రూ. 20 కోట్ల వ్యయంతో సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఇన్-లెట్, అవుట్-లెట్లను అభివృద్ధి చేశామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
