ఆక్రమణల నుంచి.. అద్భుత దృశ్యంగా ‘బషీర్‌బాగ్’ చెరువు!
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్:
ఆక్రమణలతో కనుమరుగవుతూ, మురుగు కూపంగా మారిన చారిత్రక ‘బమృకున్-ఉద్-దౌలా’ చెరువు రూపురేఖలు మారిపోయాయి. హైడ్రా(HYDRAA) చేపట్టిన పునరుద్ధరణ పనులతో చెరువు నేడు కొత్త శోభను సంతరించుకుంది. ఈ సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ చెరువును నగర ప్రజలకు అంకితం చేయనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఉదయం స్వయంగా పరిశీలించారు. చెరువు పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నిర్వహించనున్న సభా స్థలి ఏర్పాట్లపై అదనపు కమిషనర్ ఆర్.సుదర్శన్, ఏసీపీలు తిరుమల్, ఉమామహేశ్వరరావు తదితర అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సుమారు 4.20 ఎకరాలకే పరిమితమై, ఆక్రమణల కోరల్లో చిక్కుకున్న ఈ చెరువును హైడ్రా 18 ఎకరాల వరకు విస్తరించింది. పూడిక తీయడమే కాకుండా, మురుగునీరు చెరువులోకి చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో జలాశయం ఇప్పుడు స్వచ్ఛంగా కనిపిస్తోంది. చెరువు చుట్టూ ఆహ్లాదకరమైన పాత్‌వేలు, సందర్శకులను ఆకట్టుకునే గజబోలు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు.
హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు
చెరువును ఇంతటి సుందరంగా తీర్చిదిద్దుతారని తాము ఊహించలేదని స్థానిక రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. హైడ్రా పనితీరుకు ఇది నిదర్శనమని కొనియాడుతూ.. కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వారు ఘనంగా సత్కరించారు. చెరువు నిర్వహణలోనూ ఇదే తరహా నిబద్ధత ప్రదర్శించాలని వారు కోరారు..jpeg)
