గ్యాస్ ఆగమాగం.. జనం బజార్లపాలు!
- అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ తో సహా బీఆర్‌ఎస్ నాయకుల నిరసన..
- గన్ పార్క్ వద్ద సిలిండర్లతో ఎమ్మెల్యేల ఆందోళన..
- ఒక్క సిలిండర్ కోసం వారం వెయిటింగ్.. హోటళ్లు బంద్.. ఇళ్లల్లో పొయ్యిలు బంద్..
- సర్కారు దగ్గర ప్లాన్ లేదు.. సప్లైలో క్లారిటీ లేదు.. అంతా గందరగోళం!
హైదరాబాద్:
రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. సామాన్యుడి వంటగది నుంచి సిటీలోని హోటళ్ల వరకు అంతా 'నో స్టాక్' బోర్డులే కనిపిస్తున్నాయి. ఒకవైపు సిలిండర్ రాక జనం అల్లాడుతుంటే, మరోవైపు గ్యాస్ కొరతపై ప్రభుత్వం గాలిలో మాటలు చెబుతోందని విపక్షాలు భగ్గుమన్నాయి. మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్ నేతలు.. రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిని ఎండగట్టారు.
వంటగదిలో యుద్ధం.. రోడ్డుపై నిరసన!
మంగళవారం ఉదయం గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించారు. "గ్యాస్ ఇస్తారా? గద్దె దిగుతారా?" అంటూ నినదించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. "ప్రభుత్వ అసమర్థత వల్లే సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్తున్నాయి. హోటళ్లు మూతపడుతున్నాయి, చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు" అని మండిపడ్డారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
రాష్ట్రంలో గ్యాస్ కొరతకు కేవలం అంతర్జాతీయ కారణాలే కాకుండా, లోకల్ మేనేజ్మెంట్ లోపాలు కూడా ఉన్నాయని మా 'భారత శక్తి' పరిశోధనలో తేలింది:
బొట్టు బొట్టుగా సరఫరా: పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దిగుమతులు తగ్గడం వాస్తవమే అయినా, పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలో లేని కొరత తెలంగాణలోనే ఎందుకు ఎక్కువగా ఉంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
బ్లాక్ మార్కెట్ దందా: బుకింగ్ చేసుకున్నా వారం రోజుల వరకు డెలివరీ కావడం లేదు. ఇదే అదనుగా కొన్ని ఏజెన్సీలు ఒక్కో సిలిండర్‌పై రూ. 200 నుంచి రూ. 300 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి.
