జీహెచ్‌ఎంసీ కాంపౌండ్ వాల్‌ను పునాదిగా చేసుకుని కబ్జా
చందానగర్‌లో 400 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా.
హైదరాబాద్:
శేరిలింగంపల్లి మండలం చందానగర్ భవానీపురంలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీకి చెందిన 400 గజాల పార్కు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల హైడ్రా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేశారు.
గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సదరు పార్కు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి హద్దులను నిర్ణయించారు. అయితే, ఆ ప్రహరీనే పునాదులుగా మార్చుకుని, అక్రమంగా గృహ నిర్మాణం చేపట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన హైడ్రా అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. లేఅవుట్ పత్రాలను పరిశీలించగా అది పార్కు స్థలమేనని నిర్ధారణ అయ్యింది. మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడాలను తొలగించి, 400 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్థలం పార్కుకు చెందినదని తెలియజేసేలా బోర్డులను కూడా నాటారు. స్వాధీనం చేసుకున్న ఈ స్థలం విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పార్కు స్థలాన్ని కాపాడినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
