గవర్నర్ ప్రసంగం అంతా 'గాలిలో మేడలే'
- తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మ తొలగింపు సాంస్కృతిక ద్రోహం..
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తెలంగాణ జాగృతి నేత పాండురంగారెడ్డి.
హైదరాబాద్:
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్ల చేసిన ప్రసంగం వాస్తవ దూరంగా, కేవలం అంకెల గారడీగా ఉందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర:
అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి.. ఆత్మ లేని దేహం వంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, సంస్కృతిని చెరిపేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉద్యమంతో సంబంధం లేని వారే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తారని విమర్శించారు.
2047 లక్ష్యం.. నేటి సంక్షోభం: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని కలలు చూపిస్తున్న ప్రభుత్వం, ప్రస్తుతం అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తుందో చెప్పడం లేదని విమర్శించారు. భవిష్యత్తు ఊహల కోసం నేటి నిరుద్యోగతను, ఆర్థిక ఇబ్బందులను గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
జీహెచ్‌ఎంసీ విభజనపై అభ్యంతరం: హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలు చేయడం వెనుక కేవలం రాజకీయ స్వార్థమే ఉందన్నారు. దీనివల్ల సామాన్యులకు వచ్చే లాభం ఏమీ లేదని, కేవలం అధికారుల సంఖ్య, నిర్వహణ ఖర్చు పెరుగుతుందని పేర్కొన్నారు.
రైతు భరోసాలో అన్యాయం: రైతు భరోసా నిధుల పంపిణీలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో కౌలు రైతులు, సామాన్య రైతులకు నేటికీ సాయం అందడం లేదని విమర్శించారు. 'రేర్' నమూనా పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు.
ప్రజాపాలన పర్యవసానం: 'ప్రజాపాలన' కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైందని, పరిష్కారం నోచుకోని 47 వేల పిటిషన్లే ఇందుకు సాక్ష్యమని పాండురంగారెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రకటించిన బుల్లెట్ రైళ్లు, విమానాశ్రయాలు సామాన్యుడికి అందుబాటులో లేవని, ఇవన్నీ కేవలం ఎన్నికల తాయిలాలుగానే మిగిలిపోతాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను 'జాగృతి' నిరంతరం ఎండగడుతుందని స్పష్టం చేశారు
