నుమాయిష్‌లో ‘గ్రేటర్’ ఘనత: జీహెచ్‌ఎంసీకి ఉత్తమ స్టాల్ అవార్డు!
- మహిళా మణుల నైపుణ్యానికి దక్కిన పట్టం
- ఆకట్టుకున్న స్వయం సహాయక సంఘాల చేతివృత్తులు
- కమిషనర్ ఆర్.వి. కర్ణన్ హర్షం.. అధికారులకు అభినందనలు
హైదరాబాద్:
నాంపల్లి ప్రదర్శన మైదానంలో కోలాహలంగా సాగుతున్న 'నుమాయిష్-2026'లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తన ప్రత్యేకతను చాటుకుంది.
అట్టహాసంగా సాగిన ఈ ఎగ్జిబిషన్‌లో అన్ని విభాగాలను తలదన్ని, జీహెచ్‌ఎంసీ స్టాల్ ‘బెస్ట్ స్టాల్’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. మహిళా సాధికారతకు నిలువుటద్దంగా నిలిచిన ఈ స్టాల్, వేలాది మంది సందర్శకుల మన్ననలు పొంది జయకేతనం ఎగురవేసింది.
ఆదర్శంగా నిలిచిన 35 మహిళా సంఘాలు
జీహెచ్‌ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌లో సుమారు 35 స్వయం సహాయక సంఘాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి.
విజేతగా ‘గ్రేటర్’:
స్టాల్ నిర్వహణ, ఉత్పత్తుల నాణ్యత, సందర్శకుల స్పందనను పరిగణనలోకి తీసుకున్న నుమాయిష్ నిర్వాహకులు, జీహెచ్‌ఎంసీకి ప్రశంసా పత్రాన్ని అందించారు. గోషామహల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి ఈ మెమెంటోను, అవార్డును స్వీకరించారు.
జీహెచ్‌ఎంసీకి ఉత్తమ స్టాల్ అవార్డు రావడం పట్ల కమిషనర్ ఆర్.వి. కర్ణన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో ఉంచి, అత్యుత్తమ ఫలితాలను సాధించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు నా అభినందనలు. పట్టణ సామాజిక అభివృద్ధి అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైంది" అని కొనియాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇలాంటి మరిన్ని వేదికలను కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు
