జిల్లాలో పంచాయితి పోరు ప్రశాంతం

- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- పోలింగ్ కేంద్రాల పరిశీలన
- జిల్లాలో 3వ విడతలో 86.42 శాతం పోలింగ్

WhatsApp Image 2025-12-17 at 5.52.11 PM

కరీంనగర్ : 

జిల్లాలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, మొదటి, రెండవ విడత ఎన్నికల మాదిరిగానే చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి  తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా  జిల్లాలోని వి. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి ఎలబోతారం, హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య, అప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ, ఆన్లైన్లో నివేదికలు సమర్పించాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి అనుమతించకూడదనీ కలెక్టర్ ఎన్నికల అధికారులను ఆదేశించారు.

3వ విడతలో 86.42% పోలింగ్
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 86.42% ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే ఇల్లందకుంట లో 87.05%, హుజరాబాద్ లో 85.04, జమ్మికుంట లో 85.72 వీణవంక 85.87 సైదాపూర్ 87.85 శాతంగా నమోదయింది.

కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం మాచినపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూరు, మామిడాలపల్లి లోను కౌంటింగ్ విధానాన్ని పర్యవేక్షించారు.అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడించే వరకు ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వరాదని కలెక్టర్ ఆదేశించారు. 

About The Author