లంచాల ‘లాభం’.. అమాయకుల ‘బూడిద’!

  • ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం 21 మంది సజీవ దహనం,అమీర్‌పేట్‌ ‘కెఎస్సార్ ఫ్యాషన్స్’ అగ్నితాండవం యాదృచ్ఛికం కాదు.. వ్యవస్థాగత నేరం!
  • *రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ మాఫియా.. అదనపు ఫ్లోర్లలో ‘మృత్యు’ గోడౌన్లు
  • *కోర్టు ‘స్టే’ల చాటున అక్రమార్కుల ఆటలు.. మున్సిపల్ లాయర్ల లాలూచీ!
  • *‘బిల్డ్ నౌ’ పోర్టల్‌లో మాయమైన పారదర్శకత.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల వెనుక భారీ ముడుపులు!

లంచాల ‘లాభం’.. అమాయకుల ‘బూడిద’!

ఢిల్లీలో అగ్నిప్రమాదం వల్ల 21 మంది మృతి, హైదరాబాద్ గతంలో చార్మినార్ సమీపంలో హాస్పిటల్ అగ్ని ప్రమాదం 20కి పైగా మృతులు, అమీర్‌పేట్ ‘కెఎస్సార్ ఫ్యాషన్స్’ అగ్నితాండవం ప్రమాదం కాదు.. లంచాల వేటలో పుట్టిన రూపకల్పన హత్య! టౌన్ ప్లానింగ్ అక్రమ అనుమతులతో  వెలిసిన వాణిజ్య మాఫియా, ముడుపులకు అమ్ముడుపోయిన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ అమాయకుల ప్రాణాలను నిలువునా బూడిద చేశాయి. టి.డి.ఆర్ ఉల్లంఘనలు, అదనపు అంతస్తుల అక్రమ గోదాములతో నగరాలు మృత్యుకూపాలుగా మారుతుంటే, అధికారుల కక్కుర్తికి అంతం లేకుండా పోయింది.
‘బిల్డ్ నౌ’ పోర్టల్ పారదర్శకతను మింగేయగా, కోర్టు స్టేల వెనుక మున్సిపల్ లాయర్ల లాలూచీ స్పష్టమవుతోంది. అక్రమాలను అడ్డుకునే ‘హైడ్రా’కు లీగల్ బ్రేకులు వేస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ శవాల దిబ్బలు హెచ్చరిస్తున్నా.. శవాల మీద పేలాలు ఏరుకునే ఈ అవినీతి వ్యవస్థ మారకపోతే, అక్రమార్కుల లాభాల జూదంలో మరిన్ని అమాయక ప్రాణాలు బలికాక తప్పదు!


(భారత శక్తి ప్రత్యేక పరిశోధనాత్మక ప్రతినిధి వీ.జి- హైదరాబాద్)

నగరం నడిబొడ్డున మరో ‘షాపింగ్ మృత్యుకూపం’ బట్టబయలైంది. టౌన్ ప్లానింగ్ అధికారుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖ ఉదాసీనత, కోర్టు ‘స్టే’ల లొసుగులు కలిసి అమాయక ప్రజల ప్రాణాలతో ఎలా జూదం ఆడుతున్నాయో అమీర్‌పేట్ అగ్ని ప్రమాదం మరోసారి నిరూపించింది. అత్యంత రద్దీ ప్రాంతమైన శ్రీనివాసనగర్ వెస్ట్, మైత్రివనం మెయిన్ రోడ్డు పక్కనే.. మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న "కెఎస్సార్ ఫ్యాషన్స్" (KSR Fashions) మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
వస్త్ర సామగ్రితో నిండిన ఆ బహుళ అంతస్తుల భవనంలో మంటలు క్షణాల్లో రెండో అంతస్తుకు, ఆపై పక్కనే ఉన్న వాణిజ్య దుకాణాలకు వ్యాపించాయి. దట్టమైన నల్లటి విషపొగతో అమీర్‌పేట్ అతలాకుతలమైంది, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. అయితే, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కాదు.. ముమ్మాటికీ మున్సిపల్, అగ్నిమాపక శాఖల అవినీతి అండతో జరిగిన "వ్యవస్థాగత నేరం"*. దీనిపై ‘భారత శక్తి’ ఇన్వెస్టిగేటివ్ డెస్క్ జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.WhatsApp Image 2026-06-05 at 19.54.58

1.పర్మిషన్ ఒక దానికి.. దందా ఇంకోదానికి!
అమీర్‌పేట్, మైత్రివనం పరిసరాల్లోని వందలాది భవనాలలాగే ఈ ప్రమాదం జరిగిన భవనంలోనూ ప్రాథమిక నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి.

 *రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ మాఫియా: నివాస ప్రాంతాల పరిధిలో కేవలం ఇళ్లు నిర్మించుకుంటామని జీహెచ్‌ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ విభాగం నుండి అనుమతులు పొంది, వాటిని రాత్రికి రాత్రే భారీ షాపింగ్ మాల్స్‌గా, బట్టల గోడౌన్లుగా మార్చేస్తున్నారు. నివాస భవనాలకు వాడే కరెంట్ లైన్లపై.. ఇలాంటి భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల ఏసీలు, హై-వోల్టేజ్ లైటింగ్ పడటంతో తీవ్రమైన ఒత్తిడి (Overload) ఏర్పడి తీగలు వేడెక్కి షార్ట్ సర్క్యూట్లకు దారితీస్తోంది.

 *ఎక్స్ట్రా ఫ్లోర్లలో ‘మృత్యు’ గోడౌన్లు: నాలుగు అంతస్తుల (G+4) వరకు కమర్షియల్ అనుమతులు తీసుకుని, టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఎరవేసి అదనంగా ఎక్స్ట్రా ఫ్లోర్స్ నిర్మిస్తున్నారు. వీటిని రికార్డుల్లో చూపించకుండా, లోపాయికారీగా "స్టోర్ రూమ్‌లు" గా వాడుతున్నారు. "కెఎస్సార్ ఫ్యాషన్స్" ప్రమాదంలో మంటలు ఇంతలా విజృంభించడానికి కారణం.. ఇలాంటి అక్రమ స్టోర్ రూముల్లో టన్నుల కొద్దీ నిల్వ ఉంచిన సింథటిక్ వస్త్ర సామగ్రియే!

2.'బిల్డ్ నౌ' పోర్టల్: పారదర్శకత శూన్యం.. అవినీతికి ఆజ్యం!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన *‘బిల్డ్ నౌ’ (Build Now)* పోర్టల్ ప్రస్తుతం అక్రమార్కులకు వరప్రసాదంగా మారింది. వ్యవస్థలో పారదర్శకత పెంచాల్సింది పోయి, అవినీతికి కొత్త వేదికగా మారింది.

 *కనపడని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు:నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భారీ అక్రమ కట్టడాలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, ఫంక్షన్ హాళ్లకు వెనుకదారిలో భారీగా ముడుపులు అందుతున్నాయి. ఆ తర్వాత వీటికి సంబంధించిన 'ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు' బిల్డ్ నౌ పోర్టల్‌లో సామాన్య ప్రజలకు కనపడకుండా మాయం చేస్తున్న దుస్థితి నెలకొంది.

 *డిజిటల్ లూటీ: ఆన్‌లైన్ సిస్టమ్ లోపాలను వాడుకుంటూ, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల కక్కుర్తితో పచ్చజెండా ఊపేస్తున్నారు.

*3.కాసులు ఇస్తే చాలు.. ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ ఖాయం!
ఒక రద్దీ వాణిజ్య సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో అమీర్‌పేట్ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఇలాంటి భవనాలకు ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఎలా వస్తోంది?

 *కళ్లు మూసుకుంటున్న అగ్నిమాపక శాఖ:జాతీయ భవన నిర్మాణ కోడ్ (NBC) ప్రకారం ప్రతి కమర్షియల్ భవనానికి ఫైర్ ఎస్కేప్ (Emergency Exits), స్ప్రింక్లర్లు, ఫైర్ హైడ్రెంట్లు ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన అగ్నిమాపక శాఖ అధికారులు ఏటా మామూళ్లు అందుకొని, ఏసీ గదుల్లో కూర్చుని క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 *మృత్యుకూపాలుగా మారిన సెల్లార్లు: పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను సైతం కమర్షియల్ గోడౌన్లుగా మార్చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? సెల్లార్లలో మంటలు అంటుకుంటే ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లే మార్గమే ఉండదు.

 *టాక్సిక్ స్మోక్ (విషపూరిత పొగ) ప్రాణాంతకం: అదనపు అంతస్తుల నిర్మాణం వల్ల వెంటిలేషన్ లోపించి, మంటలు చెలరేగినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి ప్రాణాంతక వాయువులు లోపలే పేరుకుపోతాయి. సింథటిక్ వస్త్రాలు కాలడం వల్ల దట్టమైన నల్లటి విషపొగ వెలువడి, అత్యవసర మార్గాలు లేక బాధితులు నిమిషాల్లోనే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోతున్నారు.

4.‘హైడ్రా’ యాక్షన్‌కు ‘లీగల్’ బ్రేకులు! కోర్టు ‘స్టే’ల రక్షణ కవచం
నగరంలో అక్రమ నిర్మాణాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న *‘హైడ్రా’ (HYDRAA) ఇలాంటి డేంజర్ జోన్లలో ఉన్న అక్రమ కమర్షియల్ కాంప్లెక్సులపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నా.. న్యాయపరమైన లొసుగులు అడ్డుగా మారుతున్నాయి.

 *అమ్ముడుపోతున్న మున్సిపల్ లాయర్లు: అక్రమ కమర్షియల్ భవనాలపై అధికారులు లేదా హైడ్రా నోటీసులు ఇవ్వగానే, సదరు భవన యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ తరఫున గట్టిగా వాదించాల్సిన కౌన్సిల్ లాయర్లను అక్రమార్కులు ముందే ‘మేనేజ్’ చేస్తున్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. కోర్టులో మున్సిపల్ యంత్రాంగం తరఫున సరైన అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు.

 *ఇంటర్ పిటిషన్ల దందా:ఈ లొసుగులను వాడుకుని అక్రమార్కులు కోర్టుల నుండి "ఇంటర్ పిటిషన్ ఆర్డర్లను" (Interim Stay Orders) సాధిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లు భవనం ముందుకు వెళ్లగానే.. చేతిలో ‘స్టే’ కాపీలు చూపిస్తూ మున్సిపల్ చట్టాలను హేళన చేస్తున్నారు. చివరకు ప్రమాదం జరిగి ప్రాణాలు బూడిదయ్యే వరకు ఆ భవనాల జోలికి వెళ్లే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు.

*లోకల్ టు గ్లోబల్: అగ్ని గుండాలుగా మారుతున్న నగరాలు
హైదరాబాద్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా నిబంధనల ఉల్లంఘన అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇటీవల జరిగిన ఘోరాలే ఇందుకు నిదర్శనం:

*హైదరాబాద్‌లో ఆందోళనకర గణాంకాలు (తెలంగాణ అగ్నిమాపక శాఖ నివేదిక)

 2025లో 835 ప్రమాదాలు జరగ్గా, అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వల్ల 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గుల్జార్ హౌజ్ ప్రాంతంలోనే 17 మంది మరణించడం గమనార్హం. ఇక 2026 మే నాటికే రికార్డు స్థాయిలో 765 ప్రమాదాలు సంభవించాయి. తీవ్రమైన ఎండలు, విద్యుత్ ఓవర్‌లోడ్, మరియు స్క్రాప్ గోదాముల వల్లే ఇవి జరిగాయి. దీనివల్ల ఏకంగా ₹354.82 కోట్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.


 *ఢిల్లీ మాలవీయ నగర్ భీభత్సం
 (జూన్ 3): ఒక హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ప్రమాదంలో 12 మంది సజీవదహనమయ్యారు(మొత్తం మరణాలు 21 కి చేరాయి, ఇందులో 11 మంది విదేశీయులు ఉన్నారు). ఇరుకైన మార్గాల వల్లే ఇక్కడ ప్రాణనష్టం పెరిగింది.
 *నోయిడా హైరైజ్ ప్రమాదం (జూన్ 5): సెక్టార్ 75లోని 'ఐవీ కౌంటీ' అపార్ట్‌మెంట్ 12వ అంతస్తులో మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది.

*‘హైడ్రా’ ముందున్న క్లిష్టమైన సవాళ్లు:
కేవలం కూల్చివేతలే పరిష్కారం కాదనే కోణంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి:

 1.ఆర్థిక, ఉపాధి సంక్షోభం: ఒక అక్రమ భవనాన్ని సీజ్ చేసినా, కూల్చివేసినా దానిపై ఆధారపడిన వందలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

 2.యాజమాన్యాల మొండితనం: తాము కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేశామని, తప్పు అధికారులదైతే తమను ఎందుకు బలిచేస్తారని యజమానులు హైడ్రా అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు.

 3.లీగల్ చిక్కుముడులు:ప్రభుత్వ రికార్డుల్లో అనుమతులు ఉన్నట్లు చూపించి, క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడటం వల్ల.. హైడ్రా తీసుకునే తక్షణ చర్యలకు కోర్టులు అడ్డుకట్ట వేస్తున్నాయి.

 ‘భారత శక్తి’ డిమాండ్: ఐఏఎస్ అధికారులు దృష్టి సారించాలి!
అమీర్‌పేట్ మెట్రో పిల్లర్ A1043 సాక్షిగా రేగిన అగ్ని కీలలు నగరంలోని ప్రతి అక్రమ కమర్షియల్ భవనానికీ హెచ్చరిక. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా మారిన ఈ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది.

ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమర్థులైన 'ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, లారీల కొద్దీ ముడుపులు తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్, ఫైర్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

*బిల్డ్ నౌ’ పోర్టల్‌ను పూర్తిగా ఆడిట్ చేసి పారదర్శకతను పునరుద్ధరించాలి.

*కోర్టుల్లో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న మున్సిపల్ కౌన్సిల్ లాయర్లను తక్షణమే తొలగించాలి.

*‘హైడ్రా’లాంటి ప్రత్యేక విభాగానికి పూర్తిస్థాయి న్యాయపరమైన అధికారాలు (Judicial Powers) ఇవ్వాలి.

ఇకనైనా ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వీడి, వ్యవస్థాగత అవినీతిని వేళ్లతో సహా పెకిలించకపోతే.. అమాయక ప్రజల ప్రాణాలు అక్రమార్కుల లాభాల జూదంలో బూడిద కావడం ఖాయం!WhatsApp Image 2026-06-05 at 19.54.58 (1)

About The Author