ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే
పోషణ్ మహా, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం
కరీంనగర్ :

గత ప్రభుత్వ పాలనలో శిథిలావస్థకు చేరిన మహిళ ప్రాంగణాలు ప్రస్తుతం మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తూ కళకళలాడుతున్నాయని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్, ఆటో డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం, పోషణ మాస ఉత్సవం, బతుకమ్మ ఉత్సవాలకు మంత్రి సీతక్క రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు. శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, ప్రభాకర్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు. ఇందులో భాగంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఇప్పటికే 27 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం అందజేశామని తెలిపారు. శిధిలావస్థకు చేరిన రాష్ట్రంలోని పది మహిళా ప్రాంగణాలను మళ్లీ శిక్షణకు సిద్ధం చేసి 10 కోట్ల రూపాయల కేటాయించామని అన్నారు. మహిళలకు పలు రకాల శిక్షణలు ఇస్తూ మహిళా ఇస్తూప్రాంగణాలు కళకళలాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మహిళా సంఘాల సభ్యులు విజయవంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు. నారాయణపేట మహిళా సంఘాల 11 మంది సభ్యులు పెట్రోల్ బంకు ఏర్పాటు చేసి ఆరు నెలల్లోనే 13 లక్షల ఆదాయాన్ని అర్జించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవే కాకుండా సోలార్ ప్లాంట్లు, ఆటోలు, వాహనాలు, బస్సుల కొనుగోలు కోసం బడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘంలో చేరి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు పదిలక్షల రూపాయల ప్రమాద బీమా, రెండు లక్షల లోన్ బీమా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళా సంఘం అంటే భరోసా అని, తోటి సభ్యులు కష్టసుఖాల్లో తోడుంటారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాయని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ను అభినందించారు.
