'జవాన్' ఆస్తిపై కబ్జా కోరలు: కోర్టు ఆర్డర్లు ఉన్నా అధికారుల బేఖాతరు!

  • సరిహద్దులో విధి నిర్వహణ.. సొంతూరిలో ప్లాటు ఆక్రమణ
  •  మాజీ కార్పొరేటర్ 'కబ్జా' పర్వం.. అండగా ఖద్దరు చొక్కాలు!
  •  కోర్టు తీర్పులు బేఖాతరు.. CMC అధికారుల మామూళ్ల మత్తు?
  • శేర్లింగంపల్లి జోన్ లో ఎస్.టి.ఎఫ్ నిర్వీర్యం .. తారా స్థాయిలో అక్రమాలు అవినీతి..! 
  •  ఎస్టిఎఫ్ బాస్ జోనల్ కమిషనర్ హేమంత్ ఐఏఎస్ నిర్లక్ష్యం..

'జవాన్' ఆస్తిపై కబ్జా కోరలు: కోర్టు ఆర్డర్లు ఉన్నా అధికారుల బేఖాతరు!

హైదరాబాద్:

దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడుతున్న ఒక జవానుకు సొంత గడ్డపై రక్షణ కరువైంది. జమ్మూ కాశ్మీర్‌లో CRPF సెకండ్-ఇన్-కమాండెంట్ హోదాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్. ఆస్తులపై కబ్జా కోరలు చాచాయి. గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో ఆయనకు చెందిన విలువైన ప్లాట్లను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు కలిసి అక్రమంగా ఆక్రమించుకోవడం నగరంలో కలకలం రేపుతోంది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా, హైకోర్టు మొట్టికాయలు వేసినా కబ్జాదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికారుల అండదండలతో బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు.WhatsApp Image 2026-04-12 at 19.33.01 (1)

స్టేటస్ కో ఉన్నా.. ఆగని దౌర్జన్యం!*
గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెం. 155 AA, 156 AAలలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ 2016లో ప్లాట్ నెం. 11, 12లను చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే 2018 నుంచే ఈ ప్లాట్లపై కబ్జాదారుల కన్ను పడింది. చెట్టి శ్యామ్ బాబు అనే వ్యక్తి సరిహద్దు గోడను కూల్చివేయడానికి ప్రయత్నించగా, బాధితుడు సివిల్ కోర్టును ఆశ్రయించారు. కేసు పెండింగ్‌లో ఉన్నందున 'యథాతథ స్థితి' (Status Quo) పాటించాలని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించి సదరు అధికారి తన గోడను కూడా మరమ్మత్తు చేసుకోకుండా వదిలేశారు. కానీ కబ్జాదారులు మాత్రం కోర్టు ఉత్తర్వులను కాలి కింద చెప్పులా భావిస్తున్నారు.

అదును చూసి 'షెడ్డు' వేశారు..
ప్రవీణ్ కుమార్ జమ్మూ కాశ్మీర్‌లో విధుల్లో ఉన్న అదను చూసి కబ్జాదారులు రెచ్చిపోయారు. 2024 జనవరిలో గచ్చిబౌలి 105 డివిజన్ కార్పొరేటర్ వాసేపల్లి గంగాధర్ రెడ్డి, చెట్టి శ్యామ్ బాబు, శేఖర్ గౌడ్, కృష్ణారెడ్డి తదితరులు కలిసి ప్రవీణ్ కుమార్ ప్లాట్లతో పాటు పక్కనే ఉన్న BSF ఉద్యోగి రాఘవరావు ప్లాట్‌ను కూడా ఆక్రమించారు. రాత్రికి రాత్రే పాత సరిహద్దు గుర్తులను తుడిచివేసి, కాంపౌండ్ వాల్ నిర్మించి, ఒక ఫ్యాబ్రికేటెడ్ షెడ్‌ను కూడా లేపేశారు. ఏప్రిల్ 2025లో సెలవుపై వచ్చిన బాధితుడు తన ప్లాట్ల పరిస్థితి చూసి హతాశుడయ్యారు.

ఖద్దరు బెదిరింపులు.. అధికారుల లొంగుబాటు?*
ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణకు అసలు నిందితుడు రాకుండా, కార్పొరేటర్ హాజరై అధికారులను బహిరంగంగానే బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినా, డిప్యూటీ కమిషనర్ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ACP) ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు గానీ, కూల్చివేత ఉత్తర్వులు గానీ జారీ చేయలేదు. అక్రమ నిర్మాణం అని తేలినప్పటికీ 'డిమాలీషన్' కు వెనకడుగు వేయడం వెనుక భారీగా చేతులు మారినట్లు తెలుస్తోంది.

జోనల్ కమిషనర్ తీరుపై నిరసన
తాజాగా విభజించబడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ డాక్టర్ సృజన గారికి మార్చి 30న జవాను ఫిర్యాదు చేయగా, ఆమె సానుకూలంగా స్పందించి చర్యల కోసం శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే మరుసటి రోజు బాధితుడు జోనల్ కమిషనర్‌ను కలవగా, ఆయన కనీస మర్యాద లేకుండా దురుసుగా వ్యవహరించడం గమనార్హం. "నాకు సంబంధం లేదు.. టౌన్ ప్లానింగ్ అధికారులను కలవండి" అంటూ విధి నిర్వహణ నుంచి తప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్.టి.ఎఫ్ బాస్ స్పెషల్ స్టాల్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం, తమ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పాటు చేస్తే నోటీసు లేకుండానే కూల్చివేసే అధికారం ఎస్టిఎఫ్ కు ఉంటుంది ఇది చట్టం చట్టంలో ఉంది అన్న విషయం కూడా ఆయనకు తెలియదు, నా పరిధి కాదు అంటూ ముఖం చాట్ చేయడం, అంతర్యమేమిటో ఉన్నతాధికారులు గ్రహించాలి...!
సంబంధిత టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకటరమణను అడుగుతే ఆ క్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి లెటర్ రెడీ చేసాము పోలీస్ ప్రొటెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కాలయాపన చేయడం.. బాధితులను మభ్యపెట్టి మోసం చేయడం ఎంతవరకు సమంజసం ఈ విషయంపై  సిఎంసి కమిషనర్ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి విధుల దుర్వినియోగం అవినీతి ఆరోపణలపై ఎంక్వయిరీ చేయాలని కోరుచున్నాము...

న్యాయం జరిగే వరకు పోరాటం
"దేశం కోసం నేను అక్కడ పోరాడుతుంటే, ఇక్కడ నా ఆస్తిని కాజేస్తున్నారు.. అధికారులేమో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు" అని డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా బీజేపీ మాజీ కౌన్సిలర్ అండతోనే ఈ దౌర్జన్యం సాగుతున్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఇప్పటికైనా CMC విజిలెన్స్ అధికారులు, ఏసీబీ (ACB) రంగంలోకి దిగి, అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.

About The Author