ఫలించిన బిజెపి నాయకుల పోరాటం
యాదగిరిగుట్ట :
దిగివచ్చిన దేవస్ధాన అధికారులు
దేవస్ధాన స్తంభాలపై తొలగించిన లైటింగ్ బోర్డులు
బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న బిజెపి నాయకులు

ఎట్టకేలకు బిజెపి నాయకుల పోరాటానికి ఫలితం దక్కింది. యాదగిరిగుట్ట దేవస్ధాన పునర్నిర్మాణం సమయంలో రాయగిరి నుండి పట్టణంలోని ప్రధాన రహదారి గుండా లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలకు అనుమతులు లేకుండా దేవస్ధాన మాజీ ప్రధానార్చకుడి కుమారుడికి సంబంధించిన కంపెనీ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తూ, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్ధానిక అధికారులు స్తంభాలకు ఉన్న అట్టి ప్రకటన బోర్డులను బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ దగ్గర బిజెపి నాయకులు స్వీట్లు పంచి బాణసంచా కాల్చడం జరిగింది. అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ స్వామి వారి విద్యుత్ స్తంభాలకు ప్రకటన బోర్డులు అక్రమంగా అమర్చి స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. దీనిపై బిజెపి మూడు నెలలుగా పోరాటం చేస్తూ ఆలయ ఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి, దేవాదాయ శాఖ మంత్రి మరియు సీఎం పేషీలో కూడా ఫిర్యాదు చేసి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసిన పోరాటం ఫలించిందని, ఆ ప్రకటన బోర్డులను దేవస్థానం ఈవో తొలగించుటకు అదేశాలు ఇవ్వడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఇక ముందు కూడా అవినీతిపైన రాజీలేని పోరాటం చేస్తామని, మేము ఎప్పుడూ ధర్మం వైపు నిలబడతామని మాపైన లేనిపోని నిందలు వేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, మండల మాజీ అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్, కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్, సురేష్, సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీను, రంగ సత్యం, బెలిదె అశోక్, బోడ బుచ్చిబాబు, నల్ల వాసుదేవరెడ్డి, శ్రీశైలం, కార్తీక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
