నిబంధనలు గాలికి.. ఆరు షోరూమ్‌ల సీజ్!

  • రెండో రోజూ ‘హైడ్రా’ మెరుపు తనిఖీలు
  • ​సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా గోదాములు
  • ​ ప్రమాదకర స్థితిలో ఫర్నీచర్ షాపులు.. చర్యలకు ఉపక్రమించిన అధికారులు

నిబంధనలు గాలికి.. ఆరు షోరూమ్‌ల సీజ్!

హైదరాబాద్:

 నగరంలో అగ్నిప్రమాదాల నివారణే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. హైడ్రా (HYDRAA), జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో రెండో రోజూ శుక్రవారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస భద్రతా ప్రమాణాలు పాటించని ఆరు ప్రముఖ ఫర్నీచర్ షోరూమ్‌లను అధికారులు సీజ్ చేశారు.

​సెల్లార్లే అతి ప్రమాదం..
తనిఖీల సందర్భంగా అధికారులు విస్తుపోయే నిజాలను గుర్తించారు. వినియోగదారుల పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను నిబంధనలకు విరుద్ధంగా గోదాములుగా మార్చడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాలకు ఆస్కారం కల్పించేలా కెమికల్స్, పెయింట్ డబ్బాలు, పరుపులు, బ్యాటరీలను సెల్లార్లలో భారీగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని ‘లుకింగ్ గుడ్’ ఫర్నీచర్ షాపులో సెల్లార్ ర్యాంపులను సైతం మూసేసి స్టాక్ నింపడం గమనార్హం.

​లోపించిన భద్రత:
పలు భవనాల్లో తనిఖీలు చేయగా.. కనీస అనుమతులు లేవని తేలింది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తం చేసే స్మోక్ డిటెక్టర్లు, మంటలను ఆర్పే వాటర్ స్ప్రింక్లర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది.

​సీజ్ చేసిన షోరూమ్‌ల వివరాలు:

​గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నీచర్ షాప్.

​కొంపల్లి క్రాస్ రోడ్స్ లోని అను ఫర్నీచర్.

​కూకట్‌పల్లి మరియు అత్తాపూర్ (పీవీ ఎక్స్‌ప్రెస్ వే) లోని రో
యల్ ఓక్ షోరూమ్‌లు.

​ఉప్పల్ నాగోల్ లోని బాంటియా ఫర్నీచర్.

​నాచారంలోని అను ఫర్నీచర్.

​హైడ్రా హెచ్చరిక:
షోరూమ్‌లను కేవలం వస్తువుల ప్రదర్శన (Display) కోసం మాత్రమే వినియోగించాలని, నిల్వ ఉంచేందుకు గోదాములను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని హైడ్రా స్పష్టం చేసింది. సీజ్ చేసిన షాపుల వద్ద 'ఫైర్ సేఫ్టీ లేని ప్రాంతం' అని పేర్కొంటూ బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

About The Author