స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు వుండకూడదు..
అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి..
స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల సమాయత్తాలపై గురువారం ఆమె హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి శాఖ పెద్దపీట వేశాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, రిజర్వేషన్ల కేటాయింపు, శాంతిభద్రతల బందోబస్తు వంటి అంశాలపై అధికారులు ఒకటికి రెండుసార్లు పరిశీలనలు చేయాల్సిన అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు పని చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితాను వెంటనే పంపించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతున్నాయని, అధికారులు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జెడ్పి సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్, పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
