అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ముగ్గురు అరెస్టు
గూగుల్ మ్యాప్ ఆధారంగా టార్గెట్ ఎంపిక
బ్రిలియంట్ ఇంజినీర్ కాలేజీ చోరీ కేసులో నిందితుల అరెస్టు
ముగ్గురు అరెస్టు.. ముగ్గురు పరారీ...నిందితుల్లో ఒకరు మైనర్
విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ వెల్లడి
అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీర్ కాలేజీలో అక్టోబర్ 10వ తేదీన జరిగిన చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. మంగళవారం ఉదయం 5 గంటలకు అబ్దుల్లాపూర్ మెట్ కొత్తగూడెం ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీల చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, బ్రిలియంట్ ఇంజినీర్ కాలేజీలో జరిగిన చోరీ కేసులో నిందితులుగా గుర్తించారు. వీరి నుండి చోరీ చేసిన రూ. 37,05,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం డీసీపీ అనురాధ, క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు వివరాలు వెల్లడించారు.గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజ్ మనోహర్ పవర్ (22) ఇతను బీబీఏ విద్యార్థి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రితిక్ అలియాస్ రితిక్ మోహిత్ (24) ఇతను బీఏ ఎల్ఎల్ బీ చదువుతున్నాడు. ఒక మైనర్ బాలుడు(16)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో గుజరాత్ కి చెందిన దినేష్ మోహిత్ (27), మధ్యప్రదేశ్ కి చెందిన అరుణ్ మోహిత్ (18), మహారాష్ట్ర కి చెందిన విలాస్ చౌహాన్ (22) ఉన్నారు. నిందితుల వద్ద నుండి 37 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.గత నెల 10వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీర్ కాలేజీలో ఆరుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రిన్సిపాల్ వులిగడ్ల వీరన్ (61) అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 10వ తేదీన కాలేజీ కార్యాలయ గది తాళం పగలగొట్టి, అల్మారాలో దాచిపెట్టిన విద్యార్థుల ఫీజులకు సంబంధించిన రూ.1,07,00,000 నగదును చోరీ చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాలతో ఎల్ వో, సీసీఎస్, ఐటీ సెల్, ఎస్వోటీ పోలీసులతో దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు అధికారులు గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను సందర్శించి, నేరస్తులను గుర్తించారు.
గూగుల్ మ్యాప్ ఆధారంగా చోరీలు
నిందితులు గూగుల్ మ్యాప్ ఉపయోగించి జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న విద్యా సంస్థలను ఎంచుకుని, చోరీలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో నిందితులు ఒకరికొకరు బంధువులు. దినేష్ మోహితే, అరుణ్ మోహితేపై గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఉన్నాయి. కాగా, అబ్దుల్లాపూర్ మెట్ కేసులో నిందితులందరూ ముందుగా గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని ఉమర్గామ్ గ్రామంలో సమావేశమయ్యారు. 2025 అక్టోబర్ 1వ వారంలో హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నేరాలు చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. గుజరాత్ లోని వాప్పి నుంచి ముంబైకి, అక్కడి నుంచి ఔరంగాబాద్‌కు బయలుదేరారు. 2025 అక్టోబర్ 8న స్లీపర్ బస్సులో హైదరాబాద్ లోని మియాపూర్ ప్రాంతంలో దిగారు.లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో స్నానం చేసిన తర్వాత, జూపార్క్‌కు ఆటోలో వచ్చి సమీపంలోని దుకాణంలో హ్యాండ్ గ్లవ్స్ కొనుగోలు చేశారు. అనంతరం గూగుల్ మ్యాప్ ఉపయోగించి తట్టి అన్నారంలోని శ్రేయాస్ కళాశాలకు చేరుకున్నారు.అక్కడ భద్రతా సిబ్బందిని చూసి చోరీ చేయలేమని భావించారు. తర్వాత బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాల చోరీకి అనుకూలంగా ఉందని గుర్తించారు. ఆటోలో కళాశాలకు చేరుకుని అర్ధరాత్రి 12 గంటలకు బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిన్ బ్లాక్‌లోని గ్రిల్, డోర్ లాక్‌లను పగలగొట్టి అల్మారాలో ఉన్న దాదాపు రూ.1.07 కోట్ల నగదును చోరీ చేసి, వాటాలు వేసుకున్నారు. తమ వాటాలో కొంత భాగాన్ని కళాశాల సమీపంలోని ఒక పాడుబడిన గదిలో ఉంచారు. తరువాత జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు ఎక్కి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్‌కు క్యాబ్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు ఆటోలో వెళ్లారు. అనంతరం స్లీపర్ బస్సులో విజయవాడ నుంచి ముంబైకి వెళ్లారు.
-
గుజరాత్ ఉమధ్గవ్ కి చెందిన నిందితులు కాలేజీలను టార్గెట్ చేయడంలో వీరు దిట్ట. వీరు గూగుల్ మ్యాప్ లో కాలేజీల లొకేషన్లు చూసుకొని చోరీలకు పాల్పడుతున్నారు.నిందితులు బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో చోరీ చేసిన డబ్బులతో గుజరాత్ లోని పలు ప్రదేశాల్లో భూములు కొనుగోలు చేశారు. నిందితుల కోసం 20 మంది ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుజరాత్ లో సుమారు 1000 సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు.
ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి,అబ్దుల్లాపూర్‌మెట్ ఎస్‌హెచ్‌వో అశోక్ రెడ్డి, మీర్ పేట్ డిఐ గౌరు నాయుడు, సీసీఎస్, ఐటీ సెల్ ఇన్స్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
