అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టెస్ట్ కు అపూర్వ స్పందన
18450మంది విద్యార్థులు హజరు
22న మొదటి మూడు బహుమతులు అందజేత
అల్పోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

కరీంనగర్ :
గణితంలో విద్యార్థులకు మేధస్సు పెరిగి ప్రతిభకు వన్నె తెస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని వావిలాలపల్లి లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్ఫోర్స్ మాథ్స్ ఒలంపియాడ్ - 2025 టెస్ట్ ను ప్రారంభించారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలిలో నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తని, ఆయన సేవలు చిరస్మరణీయం, చారిత్రాత్మకమని కొనియాడారు. చిన్నతనం నుండే గణిత శాస్త్రంలో మక్కువ పెంచుకొని అద్భుతాలు సృష్టించినటువంటి గొప్ప శాస్త్రవేత్త అని గుర్తుచేశారు. విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనీ, కనుగొన్నటువంటి పలు గణితంశాలను సమగ్రంగా విశ్లేషించాలని పెద్ద పోటీ పరీక్షలలో ఘన విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆరంభం నాటి నుండి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థమై జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొనీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చక్కటి ప్రణాళికలతో తెలంగాణ వ్యాప్తంగా 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించడం జరిగినదని చెప్పారు. ఈ క్రమంలో నేడు నిర్వహించినటువంటి ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18,450 విద్యార్థులు హాజరైనారని చెప్పారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఉంటాయని, మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 5000 వేలు, 3000 వేలు, 2000 వేల రూపాయల నగదు బహుమతులను ఇవ్వడంతో పాటు ప్రశంస పత్రాలను అతిథుల చేతుల మీదుగా ఈనెల 22వ తేదీన కరీంనగర్ లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో ప్రధానం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం నిర్వహింపబడే ఈ అతిపెద్ద గణిత పరీక్షకు అపూర్వ స్పందన లభించడం చాలా హర్షించదగ్గ విషయమని మరియు ప్రధానంగా వివిధ విద్యా సంస్థల వారు అందిస్తున్నటువంటి సహకారం చాలా ప్రశంసనీయమైనదని ధన్యవాదాలు తెలియజేశారు మరియు ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
