"న్యాయం గెలిచినా దక్కని హాల్ టికెట్: విద్యార్థినిపై వర్సిటీ దొరల ప్రతీకారం?"
- కోర్టు ఆదేశించినా రాని హాల్ టికెట్.. రిజిస్ట్రార్, కంట్రోలర్‌పై ధిక్కరణ పిటిషన్.
- విద్యార్థిని భవిష్యత్తుతో చెలగాటం.. ఉస్మానియా వర్సిటీలో 'ధిక్కార' కలకలం.
న్యాయస్థానం "హాల్ టికెట్ ఇవ్వు" అని ఆదేశిస్తే, వర్సిటీ దొరలు మాత్రం "మా మాటే శాసనం" అంటూ ధిక్కార రాగం అందుకున్నారట. చట్టం చదువుతున్న విద్యార్థినికే చట్టం విలువ తెలియజేయాలనే వారి తాపత్రయం చూస్తుంటే, కోర్టు తీర్పుల కంటే అధికారుల అహంకారమే గొప్పదన్నట్లు ఉంది. కంచె చేను మేసిన చందంగా, విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే విద్యార్థి భవిష్యత్తుతో బంతిలాడుతుండటం విడ్డూరం. తప్పు చేసిన వారికి తీర్పుతోనే 'ట్రీట్మెంట్' ఇస్తే గానీ, ఈ విద్యా కుసుమాలకు న్యాయం జరగదు.
హైదరాబాద్ (భారతశక్తి):
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఒక విద్యార్థిని విద్యా భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. "కోర్టు ఉత్తర్వులను పాటించం" అంటూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానించడం న్యాయ వ్యవస్థను సవాల్ చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారిపై దాఖలైన ధిక్కరణ పిటిషన్ (Contempt Petition) విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మలక్‌పేటకు చెందిన డాక్టర్ ఫౌజియా నిఖత్ ఓయూ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్ చదువుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఆమెను అనుమతించాలని, తక్షణమే హాల్ టికెట్ జారీ చేయాలని ఈ నెల 29న హైకోర్టు (W.P. నం. 1907/2026) స్పష్టమైన తీర్పునిచ్చింది. అయితే, కోర్టు ఆర్డర్ కాపీని చేతబట్టుకుని అధికారుల చుట్టూ తిరిగిన సదరు విద్యార్థినికి చేదు అనుభవమే ఎదురైంది. విద్యార్థిని విన్నపాన్ని మన్నించాల్సింది పోయి, అధికారులు మొండి వైఖరి ప్రదర్శించడం గమనార్హం.
సాధారణంగా కోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత ఏ ప్రభుత్వ సంస్థ అయినా వాటిని అమలు చేయాలి లేదా పై కోర్టులో స్టే పొందాలి. కానీ ఇక్కడ అధికారులు అనుసరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది:
మౌఖిక ధిక్కరణ: "మేము కోర్టు ఆర్డర్ పాటించం.. స్టే తెచ్చుకుంటాం" అని అధికారులు సమాధానం ఇవ్వడం వారి అహంకారానికి నిదర్శనమని పిటిషనర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇది ప్రత్యక్షంగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాలయాపన వ్యూహం: పరీక్షలు ఫిబ్రవరి 2న ప్రారంభం అవుతుండగా, జనవరి 30 వరకు హాల్ టికెట్ ఇవ్వకుండా తాత్సారం చేయడం వెనుక సదరు విద్యార్థినిని మానసికంగా కుంగదీసి, పరీక్షకు దూరం చేయాలనే కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన: 'అశోక్ చంద్ సింఘ్వీ వర్సెస్ జోధ్‌పూర్ యూనివర్సిటీ'
కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం విద్యార్థుల పక్షాన కీలక తీర్పునిచ్చింది. విద్యార్థి వైపు తప్పు లేనప్పుడు, కేవలం సాంకేతిక కారణాలు చూపి వారి విద్యా హక్కును కాలరాయకూడదని స్పష్టం చేసింది. ఓయూ అధికారులు ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం వారి అజ్ఞానమో లేక ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమో అర్థం కాని పరిస్థితి.
బోనులో కీలక అధికారులు:
ఈ ధిక్కరణ కేసులో హైకోర్టు ఎవరిని బాధ్యులుగా పరిగణించనుంది అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పిటిషనర్ తన ఫిర్యాదులో ముగ్గురు కీలక వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు:
1.డాక్టర్ గడ్డం నరేష్ రెడ్డి (రిజిస్ట్రార్, ఓయూ)
2.కె. శశికాంత్ (పరీక్షల నియంత్రణాధికారి)
3.ఎన్. రామ్ ప్రసాద్ (ప్రిన్సిపాల్, లా కాలేజీ)
స్వయంప్రతిపత్తి అంటే 'స్వేచ్ఛావిహారం' కాదు!
యూనివర్సిటీలు స్వయంప్రతిపత్తి (Autonomy) కలిగిన సంస్థలే అయినప్పటికీ, అవి భారత రాజ్యాంగానికి మరియు న్యాయస్థానాలకు లోబడి పనిచేయాలి. చట్టం చదువుతున్న విద్యార్థిని విషయంలోనే, చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఇలా ప్రవర్తించడం విద్యా వ్యవస్థలోని నైతిక పతనాన్ని సూచిస్తోంది.
కోర్టు ధిక్కార చట్టం 1971 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను అమలు చేయని పక్షంలో అధికారులకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పరీక్షలకు సమయం గంటల్లోనే ఉన్నందున, హైకోర్టు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి 'స్పాట్ ఆర్డర్' ఇచ్చే అవకాశం ఉందని, తద్వారా అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేయవచ్చని తెలుస్తోంది.
