హైడ్రా కమిషనర్‌ను కలిసిన వరంగల్ దివ్యాంగులు*
స్వేచ్ఛ వికలాంగుల కమిటీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కమిషనర్
- హైడ్రా కార్యకలాపాలను అభినందించిన ప్రతినిధులు
- వరంగల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా రావాలంటూ డిమాండ్
హైదరాబాద్:
వారంతా వరంగల్ పట్టణంలోని స్వేచ్ఛ వికలాంగుల కమిటీ ప్రతినిధులు.. అందులో కొంతమంది సరిగా నడవలేరు.. మరి కొంతమంది కనీసం నిల్చోలేరు. అయినా జీపు కట్టించుకుని వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. నేరుగా హైడ్రా కార్యాలయానికి చేరుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసారు. మేమంతా మీ అభిమానులమని చెప్పారు. వరంగల్‌లో ప్రభుత్వ భూములతో పాటు.. కబ్జాల చెర నుంచి పేద, మధ్య తరగతి వారి ఇంటి స్థలాలు విడిపించిన తీరును గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో కూడా కబ్జాదారుల భరతం పడుతున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక సాహసోపేత నిర్ణయం అయితే.. దానికి కమిషనర్‌గా మిమ్ములను నియమించడం మరింత అభినందించదగ్గ విషయమని కొనియాడారు. వరంగల్ పట్టణంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా రావాలని కోరారు. అప్పుడే భూ కబ్జాలు ఆగుతాయన్నారు. చెరువులు, కాలువలు, రహదారులు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఉండాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన కమిటీని కమిషనర్‌కు పరిచయం చేసుకున్నారు. కమిటీ రూపొందించిన క్యాలెండర్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. స్వేచ్ఛ వికలాంగుల కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అసద్, ప్రధాన కార్యదర్శి తవుడి శెట్టి జ్యోతి, వైస్ ప్రెసిడెంట్ బొళ్లం చైతన్య, ట్రెజరర్ శర్ల శివతేజతో పాటు.. పలువురు కమిటీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసిన వారిలో ఉన్నారు.
