రూ. 25 కోట్ల విలువైన ప్రజా స్థలాల పరిరక్షణ
అక్రమార్కుల గురైన భూములను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. చెంగిచెర్లలో ఫెన్సింగ్ ఏర్పాటు
మేడ్చల్ - మల్కాజిగిరి :
మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల గ్రామంలో ఉన్న జయప్రద కాలనీలో ఒక భారీ భూ రక్షణ చర్య చోటుచేసుకుంది. ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన సుమారు 4400 గజాల స్థలాన్ని ‘హైదరాబాద్ విపత్తుల ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ’ (హైడ్రా) స్వాధీనం చేసుకుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
*కేటాయింపుల వివరాలు
స్వాధీనం చేసుకున్న 4400 గజాల విస్తీర్ణంలో వివిధ ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన స్థలాలు క్రింది విధంగా ఉన్నాయి:
*ఉద్యానవనం (పార్కు): 1200 గజాలు
*వాణిజ్య సముదాయాలు (షాపింగ్ కాంప్లెక్స్): 1200 గజాలు
*పాఠశాల, గ్రంథాలయం: 800 గజాలు
*రక్షిత మంచి నీటి ట్యాంక్: 800 గజాలు
*ఆధ్యాత్మిక కేంద్రాలు (దేవాలయాలు): 400 గజాలు
ఆక్రమణల నేపథ్యంలో ప్రజావాణికి ఫిర్యాదు
వాణిజ్య సముదాయాల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు నివాస స్థలాలుగా మార్చి, ఇప్పటికే రెండు ఇళ్లను నిర్మించారు. వరుసగా జరుగుతున్న ఈ భూ ఆక్రమణలపై జయప్రద కాలనీ నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు ఈ విషయమై హైడ్రా ప్రజావాణి విభాగానికి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలన జరిపింది. ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో, తక్షణమే స్పందించి సదరు ప్రజా అవసరాల స్థలాల చుట్టూ రక్షణ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు హెచ్చరిక బోర్డులను కూడా ప్రతిష్టించింది.
ప్రజా ఆస్తులను కాపాడటంలో హైడ్రా చూపిన చొరవ పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
