ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా నాయకులు కృషి చేయాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్ బీ నగర్:
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తమ నివాసంలో నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావుతో ముందుగానే మన నియోజకవర్గ పరిధిలోనే మన భారాస పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని దానిలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నాయకులకు సూచించారు.ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల కోసం అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ఎన్నికల అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
