నోటీసులతో సాగతీత?
- హైరైజ్ కమిటీ మాయాజాలం
- - ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అక్రమ సౌదాలు?
- -నాటి టీఎస్-బీపాస్ అక్రమ దందా?
- -బడా బాబులకు టౌన్ ప్లానింగ్ జీ హుజూర్?
చట్టం బడా బాబులకైతే చుట్టం! హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిబంధనలను నిలువునా ముంచేస్తూ, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ 17 అంతస్తుల అక్రమ సౌధానికి పచ్చజెండా ఊపిన టౌన్ ప్లానింగ్ అధికారుల 'మూటల' భక్తికి జోహార్లు. నిన్న టీఎస్-బీపాస్, నేడు బిల్డ్ నౌ... పోర్టల్స్ పేర్లు మారినా తెరవెనుక చీకటి దందాల రూటు మారలేదనే విమర్శలు వస్తున్నాయి.సామాన్యుడి గుడిసెపై ప్రతాపం చూపే వ్యవస్థ, వందల కోట్ల సామ్రాజ్యాల ముందు మోకరిల్లడం మన నయా పారదర్శకతకు నిదర్శనం. పర్యావరణాన్ని బలిపెడుతూ, చారిత్రక సంపదను మింగేస్తున్న ఈ అధికార తిమింగలాల గుట్టు రట్టు చేసే 'హైరైజ్' అనుమతుల లోతైన అవినీతి కథనం ఇది......
హైదరాబాద్ :
చట్టం సామాన్యుడికి ఒకలా... బడా బాబులకు మరోలా పనిచేస్తుందా? నిబంధనల పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చేందుకు ఉరుకులు పరుగులు పెట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు, వందల కోట్ల సామ్రాజ్యం ఉన్న బడా బిల్డర్ల ముందు మోకాళ్లపై సాగిలపడుతున్నారా? అంటే అవుననే అంటోంది నగరంలో వెలుగుచూసిన తాజా భవన నిర్మాణ అనుమతుల స్కామ్!
గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ (TS-bPASS) చట్టాన్ని, అందులోని లొసుగులను వాడుకుని హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో (FTL/Buffer Zone) ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు ఏకంగా 17 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్‌కు అనుమతులు జారీ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు, హైరైజ్ బిల్డింగ్ కమిటీ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా , మరియు జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రంగంలోకి దిగి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన 17 అంతస్తుల నిర్మాణం పూర్తిగా అక్రమమని తేల్చి, నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడే అసలైన పరిశోధనాత్మక ప్రశ్న ఉద్భవిస్తోంది.
*మొదటి తప్పు ఎవరిది? రెవెన్యూ ఎంక్వయిరీ లేకుండా, ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి ఎన్‌ఓసీ (NOC) తీసుకోకుండా అసలు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ స్కైస్క్రాపర్‌కు పచ్చజెండా ఎలా ఊపింది?
.jpeg)
"నగరీకరణ సులభతరం, అవినీతి రహితం" అంటూ గత ప్రభుత్వం ప్రచారం చేసిన టీఎస్-బీపాస్ లోని పారదర్శకత లోపాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది. ఆన్‌లైన్ సిస్టమ్ అని చెబుతూనే, కీలకమైన చెరువుల ఎఫ్‌టీఎల్ (Full Tank Level) మ్యాపులను, బఫర్ జోన్ డేటాను పబ్లిక్ పోర్టల్‌లో స్పష్టంగా ఉంచకుండా... చీకట్లో ఉంచారు. ఇదే అదునుగా సామాన్యుల అప్లికేషన్లను చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేసే అధికారులు, ప్రదీప్ రెడ్డి లాంటి బడా బాబుల ఫైళ్లను మాత్రం టేబుల్ కింద చేతులు మారుస్తూ క్షణాల్లో క్లియర్ చేసేశారు.
నగర భవిష్యత్తును, పర్యావరణాన్ని, హుస్సేన్ సాగర్ వంటి చారిత్రాత్మక సంపదను ధ్వంసం చేస్తూ, బిల్డర్ల ప్రయోజనాల కోసం సంతకాలు పెడుతున్న ఉన్నతాధికారులు ఒక నిజాన్ని గ్రహించాలి. సమాజానికి మీరు చేస్తున్న ఈ ద్రోహం క్షమించరానిది. కేవలం తాత్కాలిక స్వార్థం కోసం చట్టాన్ని తుంగలో తొక్కిన వారు భవిష్యత్తులో *'సంఘవిద్రోహులు'*గా చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయం.ఇదిలా ఉండగా
ప్రభుత్వం కేవలం నోటీసులతో కాలయాపన చేయకుండా, ఈ అక్రమ అనుమతుల వెనుక ఉన్న టౌన్ ప్లానింగ్ తిమింగలాలను, హైరైజ్ కమిటీ సభ్యులను సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి ఆస్తుల లెక్కలు తీలిస్తే అప్పుడు ప్రభుత్వం పై కూడా ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
