కులగణనలో 'కోడ్' లేకపోతే బీసీలకు అన్యాయం
- *శాస్త్రీయత లోపిస్తే ప్రయోజనం శూన్యం: బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా మేధావుల హెచ్చరిక
- *ప్రధానికి లేఖ రాసిన బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం
*హైదరాబాద్:
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జనగణనలో కులగణన ప్రక్రియ శాస్త్రీయంగా లేకపోతే, వెనుకబడిన తరగతుల (బీసీ)కు మరోసారి తీరని అన్యాయం జరుగుతుందని బీసీ మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
*కోడ్ వ్యవస్థ లేకపోతే గందరగోళమే!
ఈ సందర్భంగా బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రీ-టెస్టింగ్ ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కోడ్లు ఉన్నప్పటికీ, ఇతర కులాల విషయంలో 'ఓపెన్-ఎండెడ్' విధానాన్ని అనుసరించడం ప్రమాదకరం. దీనివల్ల ఒకే కులం ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పేర్లతో నమోదై, గణాంకాలు తప్పుల తడకగా మారుతాయి. 2011 నాటి సామాజిక-ఆర్థిక కుల గణన (SECC)లో ఇదే జరిగి, దేశవ్యాప్తంగా 42 లక్షల కులాల పేర్లు నమోదై గణన విశ్వసనీయత దెబ్బతిన్నది" అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే, బీహార్ కులగణనలో అనుసరించిన 'యూనిక్ కోడ్' విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2011 నాటి పాత ప్రశ్నావళితో ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం అసాధ్యమని మేధావులు స్పష్టం చేశారు. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నావళిని సవరించాలని, తుది నిర్ణయానికి ముందు బీసీ సంఘాలు, నిపుణులతో విస్తృత చర్చలు జరపాలని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రికి పంపిన లేఖను సమావేశంలో విడుదల చేశారు.
*అధికారుల స్పందన
*పూర్ణ చందర్ రావు (రిటైర్డ్ ఐపీఎస్, మాజీ డీజీపీ):
ప్రభుత్వాలు దశాబ్దాలుగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని, ప్రస్తుత గణనలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు.
*కిరణ్ కుమార్ (ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్): యూనిక్ కోడ్ వ్యవస్థ లేని కులగణన తుపాకీలో తూటా లేని తుపాకీ వంటిదని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో దుర్గయ్య గౌడ్, ఐలి వెంకన్న, ఎర్రమాద వెంకన్న, సింగం నగేష్, నాగభూషణం, చెన్న శ్రీకాంత్, కొండల్ గౌడ్, లింగేష్ యాదవ్, జెల్ల నరేందర్, భిక్షపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
