జి.హెచ్.ఎం.సి కార్మికుని కుటుంబానికి భరోసా:
- మానవ హక్కుల కమిషన్ ఆదేశాల అమలు!
- *రూ. 15.50 లక్షల పరిహారం, రెండు ఉద్యోగాలు.. భద్రతా చర్యలు ముమ్మరం చేసిన జిహెచ్ఎంసి పాలక.
హైదరాబాద్ :
యూసుఫ్‌గూడ చెత్త తరలింపు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం చేకూరింది. ఈ విషాద ఘటనపై స్వచ్ఛందంగా స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పూర్తిగా అమలు చేసింది. బాధితుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఉపాధి కల్పిస్తూ తీసుకున్న చర్యల నివేదికను కమిషన్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో, సదరు కేసుపై విచారణను మానవ హక్కుల కమిషన్ ముగించింది.
*మానవత్వంతో స్పందించిన హక్కుల కమిషన్
నగరంలోని యూసుఫ్‌గూడ చెత్త తరలింపు కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుడు సుధాకర్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది జనవరి 25న కమిషన్ స్వప్రేరణతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది. కార్మికుడి కుటుంబానికి తక్షణ న్యాయం అందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు పొంచి ఉండకుండా చూడాలని నగర పాలక సంస్థను ఆదేశించింది.
కమిషన్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను నివేదిక రూపంలో కమిషన్‌కు సమర్పించింది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు:
*ఆర్థిక సహాయం: మృతుడి కుటుంబానికి రూ. 15.50 లక్షల పరిహారాన్ని నగర పాలక సంస్థ చెల్లించింది.
*ఉపాధి కల్పన: అర్హత నిబంధనల ప్రకారం బాధిత కుటుంబ సభ్యులలో ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
రక్షణ చర్యలు: నగరంలోని అన్ని చెత్త తరలింపు కేంద్రాలలో కార్మికుల ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించేలా కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలులోకి తెచ్చారు.

