*ప్రైవేట్ విద్య.. అక్షరాల ‘దోపిడీ’!

  • కార్పొరేట్ , ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టారాజ్యంగా ఫీజుల మోత.. 30 నుంచి 50 శాతం అదనపు భారం
  • విలవిల లాడిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు..
  • ప్రజాగ్రహానికి గురిగాక ముందే ఉన్నత అధికారులు తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్రటరీ, సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి.. 
  • *నియంత్రణ చట్టం తేవడంలో విద్యాశాఖ వైఫల్యం.. సీఎం రేవంత్ రెడ్డి జోక్యానికి ‘ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్’ డిమాండ్.

*ప్రైవేట్ విద్య.. అక్షరాల ‘దోపిడీ’!

లక్షల ఫీజులతో ప్రైవేట్ రాబందులు మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతుంటే, మన విద్యాశాఖ 'అధికార' పుంగవులు మాత్రం ఏసీ గదుల్లో హాయిగా గుర్రుపెట్టి నిద్రిస్తున్నారు! కిండర్ గార్డెన్‌కే లక్షలు గుంజుతూఈ అక్షరాల దోపిడీ సాగుతున్నా.. ఎమ్ఈఓ (MEO), డీఈఓ (DEO)లకు మాత్రం ఏమీ తెలియనట్లు 'మామూళ్ల' మత్తులో జోగుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యాలు విసిరే నోట్ల కట్టలకు లొంగి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నట్టేట ముంచుతూ మూగప్రేక్షకుల్లా మారిన విద్యా కమిషనర్, అధికారుల తీరు చూస్తుంటే విద్యాశాఖ ఉందో లేదో అనే అనుమానం కలుగుతోంది. ఇకనైనా ఈ నిమ్మకు నీరెత్తిన వైఖరి వీడి, కళ్ళు తెరవకపోతే సామాన్యుడి ఆగ్రహానికి గురికాక తప్పదు.WhatsApp Image 2026-07-08 at 19.32.48 (1)


*హైదరాబాద్

రాష్ట్రంలో విద్య అనేది ఒక హక్కుగా కాకుండా, కార్పొరేట్ శక్తుల చేతుల్లో అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారిపోయింది. హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల పెంపు పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతున్నాయి. గడిచిన విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఫీజులను ఏకంగా 30 శాతం నుండి 50 శాతం వరకు పెంచేసి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఈ ఫీజుల మోత తట్టుకోలేక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, అప్పుల పాలవుతున్నాయి.

*కిండర్ గార్డెన్‌కే లక్షలు.. ప్రీమియం స్కూళ్లలో కోట్లలో వసూళ్లు!
నగరంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక విద్య (కిండర్ గార్డెన్) స్థాయి నుంచే వార్షిక ఫీజులు రూ.లక్ష దాటుతున్నాయి. ఇక అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయని చెప్పుకునే కొన్ని ప్రీమియం పాఠశాలల్లో కేవలం వార్షిక ట్యూషన్ ఫీజే రూ.3.6 లక్షల నుండి రూ.10.5 లక్షల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ఒక సాధారణ అంతర్జాతీయ పాఠశాల (ఫ్యూచర్ లీడర్స్ ఇంటర్నేషనల్ స్కూల్) బోర్డుపై ప్రదర్శించిన ఫీజుల పట్టికను పరిశీలిస్తే ప్రైవేట్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది:
​ఒక విద్యార్థి ప్రవేశం నుండి విద్యా సంవత్సరం ముగిసే వరకు అయ్యే మొత్తం ఖర్చులను వేర్వేరు విభాగాలుగా విభజించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇందులో అత్యధికంగా ఒకేసారి చెల్లించాల్సిన ప్రవేశ రుసుము (అడ్మిషన్ ఫీజు) కింద ₹ 1,50,000 ఖర్చవుతుంది. అలాగే, విద్యా సంవత్సరానికి గాను అయ్యే వార్షిక ట్యూషన్ ఫీజు (ట్యూషన్ ఫీజు) ₹ 1,80,000 గా ఉంది, ఇది మొత్తం ఫీజుల్లోనే అత్యధిక భాగం.
​ఇక ఇతర సదుపాయాలు మరియు వనరుల విషయానికి వస్తే... విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం రవాణా చార్జీల (ట్రాన్స్పోర్ట్ ఫీజు) కింద ₹ 45,000, చదువుకు అవసరమైన పుస్తకాలు మరియు దుస్తుల (బుక్స్ అండ్ యూనిఫామ్) కోసం ₹ 25,000 ఖర్చవుతాయి. వీటితో పాటు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ఇతర కార్యక్రమాల రుసుము (యాక్టివిటీ ఫీజు) కింద ₹ 20,000, మరియు వివిధ రకాల అదనపు చార్జీల  రూపంలో మరొక ₹ 30,000 వసూలు చేయడం జరుగుతుంది.

ప్రాథమిక స్థాయి విద్యకే ఒక విద్యార్థిపై ఏడాదికి రూ.4.5 లక్షల భారం పడితే, ఇద్దరు పిల్లలున్న సగటు మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

*ఖర్చంతా ప్రైవేటుకే.. పొదుపులు ఖాళీ!
ఇటీవలి గణాంకాల ప్రకారం, తెలంగాణలో విద్యా వ్యయం మొత్తం ఒక నిర్మాణాత్మక సమస్యగా రూపాంతరం చెందింది. 2025 నాటి సర్వే నివేదికల ప్రకారం, రాష్ట్రంలో ఒక విద్యార్థిపై ప్రభుత్వ పాఠశాలలో సగటున రూ.2,609 ఖర్చు అవుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో అది రూ.38,479 గా ఉంది. అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి వల్ల రాష్ట్రంలో దాదాపు 63 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సంస్థలపైనే ఆధారపడుతున్నారు.
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ జీవితకాల పొదుపు మొత్తాలను ఖాళీ చేస్తున్నారు. మరికొందరు ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. "మేము లక్షలు ఖర్చు పెడుతున్నాం.. నువ్వు తప్పక ప్రథమ స్థానంలో నిలవాలి" అంటూ తల్లిదండ్రులు పిల్లలపై పెట్టే ఒత్తిడి వల్ల విద్యార్థులు సైతం తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతున్నారు.WhatsApp Image 2026-07-08 at 19.32.47 (1)

*అధికారుల ‘మామూళ్ల’ మత్తు.. ప్రభుత్వ ఉదాసీనత!
క్షేత్రస్థాయిలో విద్యాశాఖ పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాల్సిన మండల విద్యాధికారులు (MEO), జిల్లా విద్యాధికారులు (DEO) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల ఇచ్చే ‘మామూళ్ల’ మత్తులో జోగుతూ, అక్రమ వసూళ్లను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు ఈ వ్యవహారంలో మూగప్రేక్షకుడి పాత్ర పోషిస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

పరిష్కారం ఏమిటి?*
పక్క రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ ప్రైవేట్ పాఠశాలల ఫీజులను క్రమబద్ధీకరించడానికి ఒక నిర్దిష్టమైన, కఠినమైన 'ఫీజు నియంత్రణ చట్టాన్ని' తక్షణమే తీసుకురావాలని 'ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్' సంస్థ డిమాండ్ చేస్తోంది.

 *చట్టబద్ధ నియంత్రణ:
పాఠశాలల్లో ఫీజుల నిర్ణయాధికారాన్ని కేవలం యాజమాన్యాలకే వదిలేయకుండా, తల్లిదండ్రుల కమిటీలకు కీలక భాగస్వామ్యం కల్పించాలి.

 *ప్రభుత్వ విద్య బలోపేతం: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium), డిజిటల్ తరగతులు, పరిశుభ్రమైన వాతావరణం, అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పిస్తేనే ప్రైవేట్ దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది.
ఈ విద్యా దోపిడీపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని, పారదర్శకమైన విధానాన్ని అమల్లోకి తెచ్చి మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

About The Author