*పర్యావరణ విధ్వంసకులపై ఎన్‌జీటీ ఉక్కుపాదం:
- బండరావిరాల గ్రామం సర్వే నెం.268లో గనుల తవ్వకాలు, రాళ్లు పగలగొట్టే యంత్రాల బంద్!
- *ముందస్తు పర్యావరణ అనుమతి లేని తవ్వకాలు పూర్తిగా చట్టవిరుద్ధం.. పులిచెర్ల చెరువు పునరుద్ధరణకు తక్షణ ఆదేశాలు
- *రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్లకు, పిసిబి అధికారులకు, మైనింగ్ అధికారులకు, ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు.. రంగంలోకి దిగాల్సిన అధికార యంత్రాంగం
*హైదరాబాద్:
నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, పకృతి వనరులను నిలువునా దహించివేస్తున్న అక్రమ గనుల మాఫియాపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బండరావిరాల రెవెన్యూ పరిధిలోని చిన్నరావిరాల గ్రామం సర్వే నంబర్ 268లో సాగుతున్న అక్రమ గనుల తవ్వకాలు, రాళ్లు పగలగొట్టే క్రషర్ల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని చెన్నైలోని దక్షిణ మండల జాతీయ హరిత ట్రిబ్యునల్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా సాగే ఏ ఒక్క తవ్వకం ప్రక్రియను చట్టబద్ధం చేయలేమని స్పష్టం చేస్తూ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.
ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ (ఎమ్మార్వో) తక్షణమే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, ఈ అక్రమ సామ్రాజ్యంపై చట్టపరమైన ఉక్కుపాదం మోపాల్సి ఉంది..jpeg)
*ముందస్తు అనుమతి లేకుంటే అక్రమమే!
అకిటి నిఖిల్ రెడ్డి, పి. ఇందిరా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై (అప్లికేషన్ నంబర్ 9/2022) న్యాయమూర్తి పుష్ప సత్యనారాయణ, నిపుణుల కమిటీ సభ్యులు ప్రశాంత్ గరగవాతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఉమ్మడి పరిశీలన కమిటీ నివేదికలు, వివిధ ప్రభుత్వ శాఖలు సమర్పించిన సాక్ష్యాలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ట్రిబ్యునల్.. అనుమతులు లేని గనులు, రాళ్లు పగలగొట్టే యంత్రాలు, తారు మిశ్రమ యూనిట్లను (హాట్ మిక్స్ ప్లాంట్లు) వెంటనే మూసివేయాలని ఆదేశించింది.
*సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావన.. ఆ వెసులుబాటు చెల్లదు!
గనుల తవ్వకాలు లేదా పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత పర్యావరణ అనుమతులు పొందడం (పోస్ట్-ఫ్యాక్టో క్లియరెన్స్) చట్టబద్ధం కాదని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో 'వనశక్తి' కేసులో నిర్దేశించిన న్యాయ సూత్రాలను ఉటంకిస్తూ.. నిబంధనల ఉల్లంఘనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా సహజ వనరులను దోపిడీ చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.
అక్రమ తవ్వకాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సహజ నీటి వనరులను, ముఖ్యంగా ఆ ప్రాంతంలోని 'పులిచెర్ల కుంట' (చెరువు)ను తక్షణమే పునరుద్ధరించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రకృతికి జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
*కాలుష్య నియంత్రణ మండలికి కఠిన ఆదేశాలు
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణానికి ముప్పుగా మారిన రాళ్లు పగలగొట్టే క్రషర్లు, తారు మిశ్రమ యూనిట్లపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఎన్‌జీటీ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు భారీగా పర్యావరణ నష్టపరిహారం కూడా విధించాలని సూచించింది. బాధితుల సుదీర్ఘ పోరాటానికి ఎన్‌జీటీ తీర్పుతో ఎట్టకేలకు న్యాయం చేకూరినట్లయింది.
