ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌లో తెలంగాణకు పెద్దపీట

  • జాతీయ కార్యదర్శిగా వక్కలంక శ్రీనివాసరావు – జాతీయ ఉపాధ్యక్షుడిగా చింతపల్లి మంగపతిరావు నియామకం
  • నేషనల్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ వెల్లడి

ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌లో తెలంగాణకు పెద్దపీట

హైదరాబాద్: 

ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ (ఏ ఐ బి ఎఫ్ ) సంస్థాగత బలోపేతం, దేశవ్యాప్తంగా బ్రాహ్మణుల సంక్షేమం లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్రాహ్మణ నాయకులకు జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేషనల్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ ప్రకటించారు.
ఇటీవల జైపూర్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు, జాతీయ అధ్యక్షులు  ఎస్ డి శర్మ అనుమతితో... వక్కలంక శ్రీనివాసరావును జాతీయ కార్యదర్శిగా చింతపల్లి మంగపతిరావును జాతీయ ఉపాధ్యక్షుడిగా  నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏబి6 న్యూస్ ఛానల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారికి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉద్యమాత్మకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే విద్యా రంగంలో EWS చట్ట సవరణ వల్ల వస్తున్న ఇబ్బందుల నుండి బ్రాహ్మణ విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా విధానాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి అవసరమైన చర్యలు చేపట్టేందుకు జాతీయ కార్యవర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు.
బ్రాహ్మణుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధికి తోడ్పడే విధంగా రూ.25 వేల కోట్ల జాతీయ బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నిరంతర చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాబోయే నవంబర్ 14, 15 తేదీలలో హైదరాబాద్ వేదికగా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల విజయవంతానికి తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలు, సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.
తమపై విశ్వాసం ఉంచి జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకత్వానికి జాతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యక్షుడు చింతపల్లి మంగపతిరావు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కోశాధికారి తిప్పావచుల నారాయణశర్మ, ఏబి6 న్యూస్ ఛానల్ అధినేత విష్ణుకాంత్ శ్రీకాంత్, జాతీయ కార్యదర్శి వారణాసి వంశీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు దుడ్డు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

About The Author