గడువులోగా 'ప్రత్యేక సమగ్ర సవరణ' పూర్తి చేయాలి!
- *అధికారులకు భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశం
- *హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
- *తెలంగాణలో 'ఎస్ఐఆర్ 2026' ప్రక్రియపై ఉన్నతాధికారులతో దృశ్య శ్రవణ సమావేశం
*భారత శక్తి,
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కొనసాగుతున్న సవరణ ప్రక్రియ పురోగతిపై ఆయన దిల్లీ నుంచి ఉన్నతాధికారులతో దృశ్య శ్రవణ సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఓటరు జాబితా పరిశీలకులు పాల్గొన్నారు.
*గణన పత్రాల నమోదు వేగవంతం చేయాలి
సమావేశంలో పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ... ఓటర్ల గణన పత్రాల (ఎన్యూమరేషన్ ఫారాల) పంపిణీ, వాటి సేకరణ, కంప్యూటరీకరణ (డిజిటలైజేషన్) ప్రక్రియలను మరింత వేగవంతం చేసి సకాలంలో ముగించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కంప్యూటరీకరణ నెమ్మదిగా సాగడంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా జిల్లాల్లో అదనపు సిబ్బందిని నియమించుకుని అయినా సరే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
*ఉత్తమ విధానాలను అందిపుచ్చుకోండి:
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న జిల్లాల అధికారులను కమిషన్ ఈ సందర్భంగా అభినందించింది. వారు క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న ఉత్తమ వ్యూహాలను, పద్ధతులను మిగిలిన జిల్లాల ఎన్నికల అధికారులు కూడా అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న గణన పత్రాల పంపిణీ, సేకరణ, కంప్యూటరీకరణ ప్రక్రియలను రోజువారీగా నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం పర్యవేక్షించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 'ఎస్ఐఆర్ 2026' ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా, నిర్ణీత సమయంలోగా విజయవంతంగా పూర్తి చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని పవన్ కుమార్ శర్మ స్పష్టం చేశారు.
