నేడు హైకోర్టులో ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల కేసు విచారణ..
- *సల్కం చెరువు ఎఫ్టీఎల్ వివాదం: చట్టాల ఉల్లంఘనా? అధికారుల ఉదాసీనతా?
- *హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే ఫాతిమా కాలేజీని కూల్చివేయాలి.. సామాన్యుడికి ఒక న్యాయం, బడా బాబులకు ఒక న్యాయమా?
*హైదరాబాద్:
పర్యావరణ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కి, జలాశయాల గర్భంలో వెలిసే అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ‘సల్కం చెరువు’ పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలో నిర్మితమైన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు (జూలై 9న) కీలక విచారణ జరపనుంది. గత మూడు నెలలుగా కోర్టు ఆదేశించినా నివేదిక సమర్పించడంలో విఫలమైన ప్రభుత్వ శాఖల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఎందుకు ప్రమాదకరం?
పర్యావరణ మరియు హైడ్రాలజీ (జలవిజ్ఞానం) సూత్రాల ప్రకారం, ఒక చెరువు లేదా జలాశయం యొక్క ఎఫ్టీఎల్ పరిధి అనేది కేవలం నీరుండే స్థలం మాత్రమే కాదు; అది ఆ పరివాహక ప్రాంతానికి ఒక 'రక్షణ కవచం'.
*భూగర్భ జలాలు - కాలుష్యం: విద్యాసంస్థల నుండి వెలువడే వ్యర్థాలు, మురుగునీరు నేరుగా చెరువులోకి చేరడం వల్ల జీవవైవిధ్యం దెబ్బతినడమే కాకుండా, పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు (Groundwater) పూర్తిగా కలుషితమవుతాయి.
*స్పేస్ శాటిలైట్ డేటా (NRSC):గత కొన్ని దశాబ్దాల ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే, సల్కం చెరువు పరివాహక ప్రాంతం ఏటా ఎలా కుంచించుకుపోతోందో స్పష్టమవుతుంది. ప్రకృతి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నిర్మాణాలకు అనుమతులు ఎలా లభించాయన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా దూసుకుపోతున్నామని ప్రకటించుకున్న హైడ్రా (HYDRAA) చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే జరిమానాలు, నోటీసులు లేకుండా కూల్చివేసే యంత్రాంగం, మరి ఇంత పెద్ద సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో యథేచ్ఛగా వెలిసిన ఫాతిమా కాలేజీ భవనాల వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు?
హైడ్రాకు నిజంగా పర్యావరణంపై చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ శక్తులకు లొంగకుండా ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలి. చట్టం కేవలం బలహీనులపైనే ప్రతాపం చూపిస్తుందా, బడా బాబుల జోలికి వెళ్ళలేదా అనే అనుమానాలకు బలం చేకూరక ముందే అధికారులు స్పందించాలి.
*సామాన్యులకు ఒక న్యాయం.. బడా బాబులకు ఒక న్యాయమా?
ఈ వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తున్నది ఒకటే—ద్వంద్వ నీతి. ఒకవైపు పేద, మధ్యతరగతి ప్రజలు నిబంధనలు తెలియక చిన్న తప్పు చేసినా ఇళ్లను కూల్చివేస్తూ వీధులపాలు చేస్తున్న అధికారులు, మరోవైపు వందల కోట్లతో, రాజకీయ అండదండలతో చెరువుల గర్భాన్ని మింగేస్తున్న బడా బాబుల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు?
సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధి అని స్పష్టంగా ఆధారాలు ఉన్నా, ఈ విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం సామాన్య ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, వ్యవస్థలపై నమ్మకాన్ని సడలించేలా చేస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కానీ, అది కేవలం పేదలపైనే పనిచేసి, పీఠాలపై ఉన్నవారికి చామరలు వేయకూడదు.
*బల్దియా, రెవెన్యూ శాఖల వైఫల్యంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
గత విచారణల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం సంబంధిత శాఖలపై సన్ధించిన ప్రశ్నలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి:
1. చెరువు ఎఫ్టీఎల్ పరిధి అని తెలిసి కూడా విద్యాశాఖ అనుమతులు (Acknowledge/Affiliation) ఎలా మంజూరు చేసింది?
2. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (బల్దియా) మరియు రెవెన్యూ అధికారులు భవన నిర్మాణ ప్లాన్‌ను ఎలా ఆమోదించారు?
3. నీటిపారుదల (Irrigation) శాఖ జారీ చేయాల్సిన 'నోబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) చట్టబద్ధంగానే ఉందా..!
*కోర్టు హెచ్చరిక:"మూడు నెలలు గడువు ఇచ్చినా నివేదిక సమర్పించకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. జూలై 9 లోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే." అని గతంలోనే ధర్మాసనం స్పష్టం చేసింది.
*నేటి విచారణపైనే అందరి నజర్!
ప్రభుత్వ యంత్రాంగం మరియు సదరు విద్యాసంస్థల యాజమాన్యం కోర్టుకు ఎలాంటి నివేదికలు సమర్పించబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ్యవస్థలను మేనేజ్ చేసి పర్యావరణాన్ని బలిపెడుతున్న బడా బాబుల గుట్టు రట్టవుతుందా? లేక అధికారులు ఎప్పటిలాగే కాలయాపన సమాధానాలతో తప్పించుకుంటారా?
ఏది ఏమైనా, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో న్యాయస్థానాలు చూపిస్తున్న చొరవపై సామాన్య ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. నేటి విచారణలో హైకోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేయనుందో, హైడ్రా తన నిజాయితీని ఎలా నిరూపించుకోబోతుందో వేచి చూడాలి.
