మణికొండలో ఏసీబీ ఉచ్చు: మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఇంట్లో సోదాలు!
డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీగా అనుమానం.. రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు
మణికొండ:
మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కే. నరేందర్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం తెల్లవారుజామున ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్న పోలీస్ ఉప సూపరింటెండెంట్ (డీఎస్పీ) భీమ్‌రెడ్డికి నరేందర్ రెడ్డి బినామీగా వ్యవహరించారనే పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
*ఏకకాలంలో ముమ్మర తనిఖీలు:
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. భీమ్‌రెడ్డి సంపాదించిన అక్రమ సొమ్మును నరేందర్ రెడ్డి వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టారనే బలమైన ఆధారాలు లభించడంతో ఏసీబీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మణికొండలోని నరేందర్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
*కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాల స్వాధీనం,
సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక భూ లావాదేవీల పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నరేందర్ రెడ్డి కి చెందిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌ల వంటి డిజిటల్ ఆధారాలను కూడా సాంకేతిక విశ్లేషణ కోసం ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమ సంపాదనకు సంబంధించిన లింకులను ఛేదించే క్రమంలో, ఈ బినామీ వ్యవహారం బయటపడింది. నరేందర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన కొన్ని వివాదాస్పద భూ లావాదేవీల్లోనూ భీమ్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
*రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం
ఒకవైపు మున్సిపాలిటీ మాజీ కీలక ప్రజాప్రతినిధి, మరోవైపు పోలీస్ ఉన్నతాధికారికి సంబంధించిన కేసు కావడంతో ఈ సోదాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నరేందర్ రెడ్డిని ఏసీబీ కార్యాలయంలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
