సర్ ప్రక్రియ వేగవంతానికి పోలింగ్ బూత్‌ల వద్ద హెల్ప్‌డెస్క్‌లు నేటి నుండి ప్రత్యేక ఏర్పాట్లు

ఓటర్లకు తహసీల్దార్ పి. వేణుగోపాల్ విజ్ఞప్తి

సర్ ప్రక్రియ వేగవంతానికి పోలింగ్ బూత్‌ల వద్ద హెల్ప్‌డెస్క్‌లు నేటి నుండి ప్రత్యేక ఏర్పాట్లు

ఎల్బీనగర్:

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు రేపటి నుంచి నియోజకవర్గ పరిధిలోని ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సరూర్ నగర్ మండల తహసీల్దార్ పి. వేణుగోపాల్ తెలిపారు.ఈ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఓటర్లు తమ ఓటరు జాబితా వివరాలను పరిశీలించుకోవడం, అవసరమైన దరఖాస్తులను నింపడం, సంబంధిత పత్రాలను సమర్పించడం, ఓటరు జాబితాకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం వంటి సేవలను ఒకే చోట పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు మరియు ఇతర ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రం వద్దే సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హెల్ప్‌డెస్క్ వద్ద సంబంధిత బీఎల్‌వోలు (BLOలు) అందుబాటులో ఉండి దరఖాస్తుల స్వీకరణ, పత్రాల పరిశీలన, అవసరమైన సూచనలు అందిస్తారని వెల్లడించారు.సర్ ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓటర్లు తమ ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేదా అవసరమైన ఇతర పత్రాలతో పోలింగ్ బూత్‌కు వచ్చి హెల్ప్‌డెస్క్ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌వోలు, బీఎల్ఏలు పరస్పర సహకారంతో సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని తహసీల్దార్ పి. వేణుగోపాల్ కోరారు.

About The Author