*నగరాన్ని ముంచెత్తుతున్న కాంక్రీట్ మహమ్మారి: వరదలకు చెక్ పెట్టాలంటే సహజ జలవనరుల పునరుద్ధరణే ఏకైక మార్గం

  • *ముస్సోరీ ‘ఎల్బీఎస్ఎన్ఏఏ’ ఐఏఎస్ అధికారుల శిక్షణలో ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం.
  • *చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే పట్టణాల్లో జలప్రళయం
  • *హైదరాబాద్‌లో రెండేళ్లలో 2,471 ఎకరాల భూముల పరిరక్షణ.. ‘హైడ్రా’ విపత్తు నిర్వహణ శైలిపై దేశవ్యాప్త ప్రశంసలు

*నగరాన్ని ముంచెత్తుతున్న కాంక్రీట్ మహమ్మారి: వరదలకు చెక్ పెట్టాలంటే సహజ జలవనరుల పునరుద్ధరణే ఏకైక మార్గం

హైదరాబాద్:

ఆధునిక నగరాలను వరదలు ముంచెత్తుతుండటానికి వాతావరణ మార్పులతో కూడిన కుంభవృష్టి ఒక కారణమైతే, దానికి తోడు మానవ తప్పిదాలు, వరద కాలువల నిర్వహణ లోపాలు ప్రధాన శాపాలుగా మారాయని హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ముస్సోరీలోని ‘లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీ’ (LBSNAA)లో మంగళవారం “నగరాల్లో వరద ముప్పు తప్పించడం – విపత్తు నిర్వహణ వ్యూహాలు” అనే అంశంపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పట్టణాభివృద్ధి, పరిపాలన, నగర ప్రణాళికా (టౌన్ ప్లానింగ్) విభాగాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, వరదలకు గల కారణాలు, వాటి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ‘హైడ్రా’ ఆవిర్భావం, పర్యావరణ పరిరక్షణతో పాటు వరదల నివారణకు తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను దృశ్యరూప ప్రదర్శన (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ద్వారా ఆయన వివరించారు. చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించడంతో పాటు పార్కులు, రహదారులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాల స్థలాల పరిరక్షణకు ‘హైడ్రా’ చేపట్టిన చర్యలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు కొనియాడారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఆక్రమణల నుంచి 2,471 ఎకరాల విలువైన భూమిని కాపాడటం, అందులో 480 ఎకరాలకు పైగా కేవలం చెరువులు, నాలాల పరివాహక ప్రాంతాలను ఉద్ధరించడం సామాన్యమైన విషయం కాదని ప్రశంసించారు. చెరువుల గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) నిర్ధారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, న్యాయస్థానాల్లోని కేసుల నిర్వహణ, ఆక్రమణల తొలగింపు సమయంలో ఎదురయ్యే రాజకీయ ఒత్తిళ్లను ఎలా అధిగమిస్తున్నారనే అంశాలపై దేశవ్యాప్త అధికారులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

*రియల్ ఎస్టేట్ మోజులో దెబ్బతిన్న సహజ జలవ్యవస్థలు
బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల ప్రస్తుత దుస్థితిని పరిశీలిస్తే పట్టణీకరణలో జరుగుతున్న ఘోర తప్పిదాలు స్పష్టమవుతున్నాయని రంగనాథ్ పేర్కొన్నారు. సహజ నీటి ప్రవాహ మార్గాలు, చెరువులు, నదులు, చిత్తడి నేలలను (వెట్‌ల్యాండ్స్) ఆక్రమించి రియల్ ఎస్టేట్ రంగానికి అడ్డగోలుగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగరాల సహజ జలవ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 *బెంగళూరు: ఒకప్పుడు ‘లేక్ సిటీ’గా పేరొందిన బెంగళూరులో చెరువులు, ప్రధాన కాలువలు (రాజకాలువలు) ఆక్రమణలకు గురై కుంచించుకుపోయాయి. నగరాల్లో 80 నుంచి 90 శాతం భూభాగం కాంక్రీటీకరణ చెందడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గం లేక నేరుగా రహదారులపైకి వచ్చి నివాసాలను ముంచెత్తుతోంది.
 *ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాన వరద నీటి మార్గమైన ‘మిథి నది’ ఆక్రమణలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలతో (డెబ్రిస్) నిండిపోయి ఉనికిని కోల్పోయింది. బ్రిటీష్ కాలం నాటి ఇక్కడి డ్రైనేజీ వ్యవస్థ గంటకు 25 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. కానీ ఇప్పుడు గంటకు 50 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షం కురుస్తోంది. దీనికి తోడు సముద్రపు పోటు (హై టైడ్) తోడైనప్పుడు నీరు వెనక్కి తన్ని నగరం జలమయమవుతోంది.
 *ఢిల్లీ: యమునా నది వరద మైదానాల ఆక్రమణ, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడి ప్రధాన సమస్యలు. 1976లో కేవలం 60 లక్షల జనాభా కోసం రూపొందించిన డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ నేటికీ అమలవుతోంది. ప్రస్తుతం జనాభా నాలుగు రెట్లు పెరిగినా డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు చేయకపోవడమే ఢిల్లీ ముంపునకు కారణమని వివరించారు.

*హైదరాబాద్‌లో ‘హైడ్రా’ మేలుకొలుపు.. నాలాల పునరుద్ధరణే లక్ష్యం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ సైతం ఈ నగరాల ముప్పునకు మినహాయింపు ఏమీ కాదని, గొలుసుకట్టు చెరువులకు నిలయమైన భాగ్యనగరంలోనూ వరదలు సాధారణంగా మారాయని రంగనాథ్ గుర్తుచేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనే చెరువులతో పాటు వరద కాలువల రక్షణ, నిర్వహణకు ‘హైడ్రా’ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆక్రమణల తొలగింపు సాహసోపేతమైన చర్య అయినప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మొదటి విడతగా 6 చెరువుల పునరుద్ధరణ చేపట్టి 75 ఎకరాల ఆక్రమణలను తొలగించి వాటిని విస్తరించినట్లు తెలిపారు. భారీగా పూడికతీత పనులు చేపట్టడంతో పాటు, నీటి రాక మార్గాలు (ఇన్‌లెట్లు), నీటి విడుదల మార్గాలను (ఔట్‌లెట్లు) అభివృద్ధి చేయడం ద్వారా పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించామని వివరించారు. ప్రస్తుతం మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, దీనిద్వారా దాదాపు 150 ఎకరాలకు పైగా జలవనరుల భూమిని కాపాడుతున్నామని పేర్కొన్నారు.
కేవలం నివారణ చర్యలే కాకుండా, వర్షాకాలంలో తక్షణ సహాయం కోసం ‘హైడ్రా’ విపత్తు ప్రతిస్పందన బృందాలతో (డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్) పాటు ప్రత్యేకంగా రుతుపవన ప్రతిస్పందన బృందాలు (మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్) రంగంలోకి దించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రధానమైన ‘ప్యాట్నీ నాలా’పై ఆక్రమణలు తొలగించడం వల్ల ఎగువన ఉన్న 8 కాలనీలకు దశాబ్దాలుగా ఉన్న వరద ముప్పును శాశ్వతంగా నివారించగలిగామని, అలాగే అమీర్‌పేటలో భూగర్భ పైపుల్లో పూడికను తొలగించి ముంపు సమస్యను పరిష్కరించామని ఉదాహరించారు. ‘హైడ్రా’ చేపడుతున్న ఈ క్షేత్రస్థాయి మార్పులను గమనిస్తున్న నగర ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణల తొలగింపునకు సహకరిస్తూ, ఈ వ్యూహాత్మక చర్యలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని రంగనాథ్ ముగించారు.WhatsApp Image 2026-07-07 at 19.34.45 (1)

About The Author