కోర్టు స్టే ఉన్నా ఆగని అక్రమ నిర్మాణాలు!
- *గచ్చిబౌలి ఎఫ్‌సీఐ లేఅవుట్‌ను పరిశీలించిన హైడ్రా, సీఎంసీ కమిషనర్లు
- *రోడ్లు, పార్కులను కబ్జా చేస్తే సహించేది లేదు: అధికారుల హెచ్చరిక
- *నిబంధనల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలకు ఆదేశం
*హైదరాబాద్, జులై 08 (భారత శక్తి బ్యూరో):
గచ్చిబౌలి జంక్షన్ పరిధిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్‌సీఐ) లేఅవుట్‌లో హైకోర్టు స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ ప్లాట్ల యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించారు. హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన బుధవారం క్షేత్రస్థాయిలో ఈ లేఅవుట్‌ను స్వయంగా పరిశీలించారు.
లేఅవుట్‌లోని ప్రజా రవాణా రహదారులు, పార్కుల హద్దులను చెరిపేసి, భారీగా తవ్వకాలు జరపడం, మట్టి పోసి భూమిని చదను చేయడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం లేఅవుట్‌లోని రోడ్లు, పార్కులు, ఖాళీ స్థలాలు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందుతాయని స్పష్టం చేశారు. వెంటనే వీటికి హద్దులు నిర్ధారించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని అక్కడి ప్లాట్ బాధితులకు అధికారులు హామీ ఇచ్చారు. కోర్టు స్టేను లెక్కచేయకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.---copy.jpeg)
*'ప్రజావాణి' ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
గతంలో (1980వ దశకంలో) దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో 162 ప్లాట్లతో ఈ ఎఫ్‌సీఐ లేఅవుట్ ఏర్పాటయింది. అయితే, ఈ లేఅవుట్ ఉనికి లేకుండా చేసేందుకు సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ప్రయత్నిస్తున్నారంటూ ప్లాట్ యజమానులు ఇటీవల ‘హైడ్రా ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడాలని వారు కోరారు. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉండటం, అక్కడ యథాతథ స్థితిని (స్టే) కొనసాగించాలని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
"కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ, ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ తవ్వకాలు జరపడం, మట్టి నింపడం చట్టవిరుద్ధం. బాధితుల ఫిర్యాదుతోనే మేం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాం. కోర్టు ఆర్డర్లను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ప్రజా అవసరాల స్థలాలను, రోడ్లను సీఎంసీ పరిధిలోకి తీసుకుని పూర్తి స్థాయిలో రక్షిస్తాం."
*హైడ్రా కమిషనర్

