ప్రజావసరాల స్థలాలపై కబ్జాదారుల పంజా!

  • నాలాలు, పార్కులు, రోడ్లు సైతం మాయం..
  • *‘హైడ్రా’ ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు – ఒకే రోజు 49 అర్జీలు
  • *రంగంలోకి కమిషనర్ ఏవీ రంగనాథ్, అదనపు సంచాలకులు వర్ల పాపయ్య

ప్రజావసరాల స్థలాలపై కబ్జాదారుల పంజా!

హైదరాబాద్:

మహానగరంలో కబ్జాదారుల అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒకచోట రహదారి ఆక్రమణ, మరోచోట పార్కు స్థలం మాయం, ఇంకో కాలనీలో ఏకంగా వరద నీటి కాలువపైనే నిర్మాణాలు.. ఇలా ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను భూబకాసురులు యథేచ్ఛగా మింగేస్తున్నారు. నాడు లేఅవుట్ వేసిన సమయంలో ఎంతో ముందుచూపుతో పాఠశాలలు, క్రీడా మైదానాలు, పార్కులు, గ్రంథాలయాల కోసం వదిలిన స్థలాలను, తదుపరి కాలంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. గతంలో జరిగిన ఇలాంటి అక్రమాలను వెలికితీసి, మిగిలి ఉన్న ప్రభుత్వ, ప్రజా స్థలాలనైనా కాపాడుకోవాలనే పట్టుదలతో నగర ప్రజలు ‘హైడ్రా’ (HYDRAA)ను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తుతున్నారు. వంద గజాల పార్కు స్థలం ఆక్రమణకు గురైనా సరే వెనక్కి తగ్గకుండా హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ సోమవారం జరిగిన ప్రజావాణిలో హైడ్రాకు మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. ఈ వినతులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, అదనపు సంచాలకులు వర్ల పాపయ్య నిశితంగా పరిశీలించారు. సమస్యల పరిష్కార బాధ్యతలను తక్షణమే సంబంధిత అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

*ప్రజావాణిలో నమోదైన కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు:
1.కాలేజీ యాజమాన్యం అక్రమ కబ్జా
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం, బోగారం గ్రామంలోని ‘సుచిరిండియా’ ప్రాజెక్టులో కొనుగోలు చేసిన దాదాపు 21 ప్లాట్లను ‘హోళిమేరి గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల’ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించుకుందని బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

2.కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనం – ప్రాణ సంకటం
బేగంపేటలోని బ్రాహ్మణవాడ రోడ్డు నంబరు 7లో ఉన్న ఒక ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరి, కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. దానిని తక్షణమే తొలగించి, పక్కనే నివసిస్తున్న పొరుగువారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని స్థానికులు కోరారు. చందానగర్ హుడా కాలనీలోని మంజీరా నీటి పైపులైన్ రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న ఇండ్ల పనులను వెంటనే నిలిపివేయాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు.

3.నిలిచిపోయిన బాక్స్ డ్రెయిన్ పనులు – కలుషితమవుతున్న భూగర్భ జలాలు
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ పరిధిలోని ‘సుద్దకుంట’ (బోడుప్పల్ కుంట)లో చేపట్టిన బాక్స్ డ్రెయిన్ (సిమెంట్ల కాలువ) పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరారు. ప్రస్తుతం ఉన్న కాలువ మార్గాన్ని మార్చి, రహదారి గుండా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల భూమి ఎత్తుపల్లాల (గ్రావిటీ) సమస్య వచ్చి నీరు ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత మార్గంలోనే పనులు పూర్తి చేయాలని కోరారు. రాచెరువు - సుద్దకుంట - ఉప్పల్ నల్లచెరువులను కలుపుతూ సాగే ఈ వరద కాలువ ద్వారా నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతాల రసాయన వ్యర్థ జలాలు కూడా వస్తున్నాయని, దీనివల్ల పరిసరాలు దుర్వాసన కొట్టడమే కాకుండా భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వాపోయారు.

*4.షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ట్యాంక్ స్థలాలు విక్రయం
మల్కాజిగిరి మండలం చెంగిచెర్ల పరిధిలోని సర్వే నంబరు 130లో ఉన్న జయప్రద కాలనీలో ప్రజావసరాల స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు ఫిర్యాదు అందింది. కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 1200 చదరపు గజాల స్థలాన్ని వంద గజాల చొప్పున చిన్న ప్లాట్లుగా మార్చి విక్రయించడమే కాకుండా, అక్కడ ఇండ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు. అలాగే నీటి తొట్టి (వాటర్ ట్యాంక్), దేవాలయం, పాఠశాల, గ్రంథాలయం, పార్కు కోసం కేటాయించిన భూములను కూడా ఆక్రమణల నుండి కాపాడాలని హైడ్రాను వేడుకున్నారు.

*5.మురుగు కాలువపై ఇల్లు.. రహదారిపైకి మలమూత్రాలు
శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లోని సాయినగర్ యూత్ కాలనీలో ప్రధాన మురుగు కాలువ (సీవరేజ్ లైన్)పై ఒక వ్యక్తి నోటరీ పత్రాల ఆధారంగా అక్రమంగా ఇల్లు నిర్మించారు. ఆ ఇంటి క్రిందుగా వెళ్లే మురుగు పైపులైన్‌ను పూర్తిగా మూసివేయడంతో మురుగునీటి ప్రవాహం ఆగిపోయింది. దీనివల్ల మురుగునీరంతా ప్రధాన రహదారిపైకి పొంగిపొర్లుతూ చెరువును తలపిస్తోందని, నివాసితులు నరకయాతన అనుభవిస్తున్నారని స్థానికులు కమిషనర్‌కు తమ గోడును వెళ్లబోసుకున్నారు.WhatsApp Image 2026-07-06 at 20.19.43

About The Author