అణు నిర్మాణాల గణిత నమూనాపై పరిశోధనకు పీహెచ్.డీ.
పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని జైనా ప్రణవి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘టోపోలాజికల్ సూచికలను ఉపయోగించి అణు నిర్మాణాల గణిత నమూనా రూపకల్పన: గ్రాఫ్ సైద్ధాంతిక విధానం’పై ఆమె పూర్తి స్థాయి పరిశోధక విద్యార్థిగా అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జె. విజయశేఖర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ పరిశోధన, అలిఫాటిక్ కీటోన్లు, కొవ్వు ఆమ్లాలు, క్యాన్సర్ నిరోధక సమ్మేళనాలతో సహా వివిధ రకాల అణువులను విశ్లేషించడానికి టోపోలాజికల్ సూచికల ఆధారంగా గణిత నమూనాలను అభివృద్ధి చేసిందన్నారు. ఈ నమూనాలు బాష్పీభవన స్థానం, ద్రవీభవన స్థానం, మోలార్ ఘనపరిమాణం, ఎంథాల్పీ, పోలరైజేషన్ వంటి కీలక అణు ధర్మాలను అధిక కచ్చితత్వంతో విజయవంతంగా అంచనా వేసినట్టు తెలిపారు.
డాక్టర్ ప్రణవి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
