ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన: రేపు బడంగ్‌పేట్‌లో అవగాహన సమావేశం
కాలనీ ప్రతినిధులు పాల్గొనాలని ఎన్నికల విభాగం పిలుపు
బడంగ్‌పేట్:
బడంగ్‌పేట్ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల విభాగం సిద్ధమైంది. ఈ ప్రక్రియపై స్థానిక ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం (జూలై 3) ఉదయం 10:30 గంటలకు బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి బడంగ్‌పేట్ పరిధిలోని అన్ని కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని బడంగ్‌పేట్ సర్కిల్ ఎన్నికల విభాగం డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు.
*138 పోలింగ్ కేంద్రాల్లో జాబితా ప్రక్షాళన
బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని మొత్తం 138 పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే ఈ ముమ్మర సవరణ ముఖ్య ఉద్దేశం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా నిష్పాక్షికంగా రూపొందించేందుకు ఈ క్రింది చర్యలు తీసుకోనున్నారు:
*కొత్త ఓటర్ల నమోదు: ఓటు హక్కు రాని అర్హులందరినీ ఓటర్లుగా చేర్చడం.
*తప్పుల సవరణ: పేర్లు, వయస్సు, చిరునామాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దడం.
మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుండి తొలగించడం.
*'వారసుల అనుసంధానం'పై ప్రత్యేక దృష్టి
ఈ సవరణ ప్రక్రియలో భాగంగా కుటుంబంలో కొత్తగా ఓటు హక్కు సాధించిన వారసుల వివరాలను వారి తల్లిదండ్రుల ఓట్లతో అనుసంధానం చేసే (మ్యాపింగ్ ప్రొజని) నూతన విధానంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. దీనివల్ల ఒకే కుటుంబంలోని ఓట్లన్నీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఓటర్ల సవరణ, వారసుల అనుసంధాన ప్రక్రియలో ప్రజలకు, కాలనీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాల ఆపరేటర్లను (హెల్ప్ డెస్క్ ఆపరేటర్లు) నియమించారు. వీరు ఈ నెల 24 (24.07.2026) వరకు ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారని ఎన్నికల విభాగం తెలిపింది.
*కాలనీ అసోసియేషన్ల పాత్ర కీలకం:
స్థానిక కాలనీలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితా దోషరహితంగా ఉండేలా చూసేందుకు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని, రేపు జరిగే అవగాహన సమావేశాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్ కోరారు.
