చీటింగ్ కేసులో మాజీ సిపి ఏకే ఖాన్ కుమారుడు..!
- *సినిమా దర్శకుడికి రూ. 50 లక్షల నామం!
- *సినిమా పెట్టుబడుల పేరుతో మోసం.. బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు
*హైదరాబాద్ :
సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టిస్తామంటూ ఓ నూతన దర్శకుడిని నమ్మించి, అక్షరాలా రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన నగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ కుమారుడు, అతని అనుచరుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. డబ్బులు తిరిగి అడిగినందుకు సదరు దర్శకుడిపై దాడికి సైతం తెగబడినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
‘మహారాజ్ఞి’కి మాయమాటలు.. రూ. 50 లక్షలు స్వాహా!
పోలీసుల కథనం ప్రకారం... చలనచిత్ర దర్శకుడు వెంకట అనీష్ రెడ్డి తన "మహారాజ్ఞి" అనే సినిమా నిర్మాణానికి పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని సన్‌లిట్ గ్రూప్ కార్యాలయంలో నిందితులైన మొహసిన్ ఖాన్ (మాజీ పోలీస్ కమిషనర్ కుమారుడు), అతని అనుచరుడు తబ్రైజ్‌లను కలిశాడు. సినిమాకు భారీ పెట్టుబడులు సమకూరుస్తామని వారు అనీష్ రెడ్డిని నమ్మించారు.
పెట్టుబడిదారులను పరిచయం చేసేందుకు కమీషన్ దారిలో... గత ఏడాది ఆగస్టులో మొహసిన్ ఖాన్‌కు రూ. 25 లక్షలు, అలాగే తబ్రైజ్‌కు మూడు విడతల్లో మరో రూ. 25 లక్షలు కలిపి మొత్తం రూ. 50 లక్షలను అనీష్ రెడ్డి చెల్లించాడు.
*మోసం బయటపడటంతో దాడి, బెదిరింపులు!
డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా పెట్టుబడిదారులను పరిచయం చేయకపోవడంతో, మోసపోయానని గ్రహించిన దర్శకుడు తన డబ్బును తిరిగి ఇవ్వాలని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు బుధవారం (జూలై 1) రాత్రి అనీష్ రెడ్డిపై దాడికి దిగి, తీవ్ర పరిణామాలెదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హైప్రొఫైల్ మోసం కేసు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
