తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన కేసీఆర్ కు ప్రజలే గుణపాఠం చెప్పారు – మల్‌రెడ్డి రాంరెడ్డి
- * తెలంగాణ కోసం పోరాడిన వారిని కేసీఆర్ పాలనలో పూర్తిగా విస్మరించారు
- * కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యమకారులకు మళ్లీ గౌరవం దక్కుతోంది
- * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆశయాల సాధన దిశగా ప్రజా పాలన కొనసాగుతోంది
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చింతల్ కుంట, మల్లికార్జున నగర్ కమ్యూనిటీ హాల్ లో ఉద్యమకారుల హక్కుల సాధన సమితి అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తెలంగాణ ప్రభుత్వ ఉద్యమ కారుల కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితంగానే సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ సేవలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు.
ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారని మల్‌రెడ్డి రాంరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఉద్యమ సమయంలో ముందుండి పోరాడిన వారిని పక్కనపెట్టి, అధికారాన్ని వారి కుటుంబంలోని వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించి, రాష్ట్రాన్ని కుటుంబ పాలనకు పరిమితం చేశారని మండిపడ్డారు. ఉద్యమంలో రక్తం చిందించిన వారికి గౌరవం ఇవ్వకుండా, “ఉద్యమకారుడు” అనే పదమే వినిపించకుండా చేయాలని ప్రయత్నించడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమని అన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆశయాలు, ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా పక్కదారి పట్టాయని, ప్రజల సంపదను దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారి త్యాగాలను విస్మరించి, ప్రజా సమస్యలను గాలికొదిలేసినందుకే బీఆర్ఎస్‌కు ప్రజలు గత ఎన్నికల్లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమకారులకు సముచిత గౌరవం కల్పించడంతో పాటు, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం, గుర్తింపుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత చారి తల్లికి మహిళా కమీషన్ మెంబర్ గా పదవి ఇచ్చి గౌరవించింది. తెలంగాణ ఉద్యమ కారుల కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులకు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడటం కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతు భరోసా అమలు, రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారదర్శక ఉద్యోగ నియామకాలు, మూసీ పునరుజ్జీవనం, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక న్యాయం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి త్యాగాలకు తగిన గుర్తింపు వచ్చేలా అన్ని విధాలా కృషి చేస్తామని మల్‌రెడ్డి రాంరెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు తిప్పర్తి రమణారెడ్డి, జెనిగె విష్ణువర్ధన్ గుర్రం గోపాల్ రెడ్డి, కొంతం యాదగిరి రెడ్డి, బట్టల రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, నేలపాటి రామారావు నాయకులు కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, సురేష్ యాదవ్, సుర్వి రాజు గౌడ్, రొక్కం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
