రూ.338 కోట్లతో ఎల్బీనగర్-ఇబ్రహీంపట్నం పరిధిలో రహదారుల ఆధునీకరణ
మంగళవారం నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన.. ట్రాఫిక్ కష్టాలకు చెక్, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు!
హైదరాబాద్:
ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.338 కోట్ల భారీ వ్యయంతో 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్' (HAM) విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లైన్ల రహదారుల నిర్మాణ పనులకు సర్వం సిద్ధమైంది. జులై 07, మంగళవారం ఉదయం 10:30 గంటలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి సమాచార సాంకేతిక (ఐటీ), పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఆర్‌డీసీ) అధ్యక్షుడు మల్‌రెడ్డి రాంరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
*అత్యాధునిక హంగులు.. కేంద్రీకృత విద్యుత్ దీపాలు (సెంట్రల్ లైటింగ్)
ఈ ప్రాజెక్టు ద్వారా ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని తుర్కయాంజాల్, తొర్రూర్, పెద్ద అంబర్పేట్, కుంట్లూరు, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కేంద్రీకృత విద్యుత్ దీపాల (సెంట్రల్ లైటింగ్) సదుపాయాలతో కూడిన ఆధునిక నాలుగు లైన్ల రహదారులు నిర్మించనున్నారు. ఈ రహదారుల వల్ల ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన, నాణ్యమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా వాహనదారులకు ట్రాఫిక్ రద్దీ సమస్య తప్పడమే కాకుండా, ఈ పరిసర ప్రాంతాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది.
* హయత్‌నగర్ – తొర్రూరు – కోహెడ – అనాజ్‌పూర్ వరకు
* అనాజ్‌పూర్ – అబ్దుల్లాపూర్‌మెట్ – బండరావిర్యాల వరకు
* హయత్‌నగర్ – కుంట్లూరు – పసుమాముల – తారామతిపేట వరకు
* సాగర్ రోడ్డు – ఇంజాపూర్ – తొర్రూరు – బ్రాహ్మణపల్లి – రాగన్నగూడ వరకు
* సాగర్ రోడ్డు – ఇంజాపూర్ – హయత్‌నగర్ వరకు
* పెద్ద అంబర్ పేట్ — మంగళపల్లి వరకు
* ఇబ్రహీంపట్నం — మంచాల్ — రంగాపూర్ — చీదేడ్ — దాత్పల్లి — మాల్ వరకు
*అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం!
రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం, గ్రామీణ–పట్టణ ప్రాంతాలను అనుసంధానించే రహదారులను ఆధునికీకరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రూ.338 కోట్ల రహదారి ప్రాజెక్టు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల భవిష్యత్ ప్రగతికి ఒక మైలురాయిగా నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
