ఓటర్ల జాబితా సవరణకు ‘స్వయం నమోదు’ వరం!
*ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరాలు సరిచూసుకోవాలి: బడంగ్‌పేట్ ఉప కమిషనర్ సమ్మయ్య పిలుపు
బడంగ్‌పేట్:
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా బడంగ్‌పేట్ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఓటరు తమ వివరాలను అంతర్జాలం ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని బడంగ్‌పేట్ ఉప కమిషనర్ వి. సమ్మయ్య కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
*డిజిటల్ విధానాలతో పారదర్శకత
ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా మార్చడానికి ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతిక విధానాలను అందుబాటులోకి తెచ్చిందని ఉప కమిషనర్ గుర్తుచేశారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లు (నవతరంరకం చరవాణులు) లేదా గణన యంత్రాల (కంప్యూటర్ల) సహాయంతో అధికారిక అంతర్జాల వేదిక (https://voters.eci.gov.in/) లేదా మొబైల్ యాప్ ద్వారా నివాసాల నుంచే సులభంగా ఓటు హక్కును పరిశీలించుకోవచ్చని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, తప్పుల సవరణలు లేదా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ విధానం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
*స్వయం నమోదుతో తప్పులకు తావుండదు: ఓటర్లు ఇతరులపై ఆధారపడకుండా, తమ వివరాలను స్వయంగా అంతర్జాలంలో నమోదు చేసుకోవడం ద్వారా తప్పులు దొర్లే అవకాశం ఉండదు.
*సాంకేతిక అవగాహన పెంచుకోవాలి: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకుంటూ డిజిటల్ విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా యువత, విద్యావంతులు తమ చుట్టుపక్కల వారికి కూడా ఈ ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన కల్పించి తోడ్పాటునందించాలి.
