ఎల్బీనగర్ లో ఎస్టిఎఫ్ నిల్ అక్రమ నిర్మాణాలు ఫుల్..!
- అనుమతి ఒకదానికి.. నిర్మాణం మరొకదానికి!
- *రెసిడెన్షియల్ అనుమతులు రెండు అంతస్తుల స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్ ఐదు అంతస్తుల నిర్మాణం
- *నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం?
- ఎల్బీనగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అధికారిని సాయి అర్చన ప్రొఫెషన్ టైం లోనే తన చాకచకాన్ని ప్రదర్శిస్తుంది అనడానికి ఈ కథనం నిదర్శనం.
- ఎం.ఎం.సి ఖజానాకు చిల్లు: సొంత జేబులు ఫుల్లు..!
- *జోనల్ కమిషనర్ వికాస్ మహతో ఐఏఎస్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ దృష్టి సారించాలి..!
ఎల్బీనగర్:
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ఎల్బీనగర్ సర్కిల్ 13 లో
నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నివాస ప్రాంతాల అనుమతులతో వాణిజ్య (కమర్షియల్) నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, అనుమతించిన అంతస్తుల కంటే అదనపు అంతస్తులను నిర్మిస్తూ కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అగ్నిమాపక భద్రత (ఫైర్ సేఫ్టీ) ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేసి చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*వివాదాస్పద నిర్మాణం వివరాలు:
మైత్రీపురం, జిల్లెల్‌గూడ గ్రామం (బాలాపూర్ మండలం) పరిధిలోని సర్వే నెంబర్ 27, ప్లాట్ నెంబర్ 143 (ఇంటి నెంబర్: 8-4/1) లో ఒక భవన నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతినిచ్చింది.
*దరఖాస్తు/పర్మిట్ నెంబర్: 471095/MERP/0014/2025 (తేదీ: 11-01-2025)
*అనుమతించిన వైశాల్యం: 188.13 చదరపు మీటర్లు (225.0 చదరపు గజాలు)
*అనుమతించిన నిర్మాణం: స్టిల్ట్ పార్కింగ్ + 2 పై అంతస్తులు (వ్యక్తిగత నివాస భవనం).jpeg)
పై నిబంధనల ప్రకారం కేవలం రెండు అంతస్తుల నివాస భవనానికి మాత్రమే అనుమతి ఉండగా, సదరు నిర్మాణదారుడు స్టిల్ట్ పార్కింగ్‌తో పాటు ఏకంగా ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, దీనిని నివాస భవనంగా కాకుండా వాణిజ్య అవసరాల కోసం వినియోగించేలా అక్రమ పద్ధతిలో విస్తరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనీస సెట్ బ్యాక్‌లు వదలకుండా, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ నిర్మాణం సాగుతోంది.
*అధికారుల అలసత్వంపై స్థానికుల ఆగ్రహం
ఈ అక్రమ నిర్మాణంపై ఎల్బీనగర్ సర్కిల్ 13 కార్యాలయంలో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారిని టి.పి.ఎస్ సాయి అర్చన కేవలం నోటీసుల జారీ వరకే పరిమితమై, వెనుక నుండి నిర్మాణదారునికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ క్షేత్రస్థాయిలో అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
నగరంలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఏస్.టి.ఎఫ్) ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ సిపిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవడంలో పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని, లబ్ధి చేకూర్చిన వారికి ఒకలా, లేని వారికి మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
*ఉన్నతాధికారులు స్పందించేనా?
ఈ వ్యవహారంపై ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో (IAS) ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయి అధికారుల నివేదికలపైనే ఆధారపడకుండా, ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. అలాగే, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించి, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆధారాలు ఫైల్ నెంబర్ల తో సహా పూసగుచ్చినట్లు పొందుపరిస్తేపొందుపరిస్తే చర్యలు తీసుకోకపోవడం, అధికారులు ఏ విధంగా విఫలమవుతున్నారు ఏ విధంగా లబ్దిపోతున్నారు అనే పరిశోధనాత్మక కథనాన్ని రేపటి కథనంలో..!

