ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) ప్రక్రియలో నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యం

ఉన్నతాధికారుల ఒత్తిడితో బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకముందే ఇచ్చినట్టుగా పోర్టల్ లో అప్డేట్ చేస్తున్నారు - శ్రీరాములు అందెల ఆరోపణ

ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) ప్రక్రియలో నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యం

మీర్ పేట్:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఒత్తిడి, ఆదేశాల కారణంగా బూత్ లెవల్ అధికారులు తమకు కేటాయించిన బూత్‌ల పరిధిలోని ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయకముందే అందజేసినట్లు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 80 శాతానికి పైగా ఎన్యుమరేషన్ పూర్తయినట్లు పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఈ విధంగా వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వివరాలను నమోదు చేయడం వల్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకత దెబ్బ తింటుందని ఆయన అన్నారు. ఓటర్లందరికీ వ్యక్తిగతంగా ఎన్యుమరేషన్ ఫారాలు అందించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను నిర్వహించాలని అధికారులను కోరారు. అదేవిధంగా, ఈ అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే దృష్టి సారించి, మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అందెల శ్రీరాములు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, అధికారులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

About The Author